దూసుకొస్తున్న ‘గజ’ తుపాన్‌

11 Nov, 2018 04:18 IST|Sakshi

నెల్లూరుకు 1180 కి.మీల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం

గంటకు 25 కి.మీ.ల వేగంతో పయనం

13 నుంచి దక్షిణకోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు

తీరం వెంబడి పెనుగాలులు 

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు

సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న వాయుగుండం శనివారం సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చనుంది. శనివారం రాత్రికి ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1140, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 1180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది మరింత బలపడి ఆదివారం నాటికి తుపానుగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది.

ఈ తీవ్ర తుపాను పశ్చిమ నైరుతి దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో 13వ తేదీ నుంచి దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో సోమవారం నుంచి గంటకు 90 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వివరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్ల వద్దని హెచ్చరించింది. ఇప్పటికే వేటలో ఉన్న వారు వెనక్కి రావాలని సూచించింది. కాగా ఈ తుపానుకు శ్రీలంక దేశం సూచించిన ‘గజ’ పేరును ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద సూచికను జారీ చేశారు.   

>
మరిన్ని వార్తలు