మా కడుపులు కొట్టొద్దు 

4 Oct, 2019 09:32 IST|Sakshi
సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్‌కు ఫిర్యాదు చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది   

సాక్షి, అనంతపురం : ‘సర్వజనాస్పత్రిలో చాలా ఏళ్లుగా సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వర్తిస్తున్నాం. వచ్చే జీతం డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇప్పుడేమో మా కన్నా సీనియారిటీ తక్కువున్న వాళ్లని పెట్టుకుని మమ్మల్ని తీసేశామని చెబుతున్నారు. ఇలా అన్యాయంగా తొలగించి మా కడుపులు కొట్టొద్దు’ అంటూ పలువురు సెక్యూరిటీ గార్డులు వేడుకున్నారు. న్యాయం చేయాలని కోరుతూ గురువారం  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డు మునీరా బేగం మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం తనను వైద్య కళాశాలలోని హౌస్‌సర్జన్‌ హాస్టల్‌ వద్దకు మార్చారన్నారు. ఇప్పుడేమో నీవు వైద్య కళాశాల పరిధిలో పనిచేశావని తమకు సంబంధం లేదంటున్నారని  వాపోయారు. తన భర్త మరణించడంతో కుటుంబాన్ని తానే పోషిస్తున్నానని, తనకు న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరో మహిళ విజయమ్మ మాట్లాడుతూ అన్యాయంగా సీనియారిటీ ఎక్కువగా ఉన్న వారిని తొలగించారని, న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.   

ఎందుకిలా?  
కాగా, ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సెక్యూరిటీ గార్డుల నియామకాల్లో ఆస్పత్రి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియారిటీని పక్కన పెట్టి కేవలం గత సెక్యూరిటీ ఏజెన్సీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని అమాయకులకు అన్యాయం చేశారని తెలుస్తోంది. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తించిన వారిని కాదని వేరే వాళ్లకు అవకాశం కల్పించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు అధికారులు సెక్యూరిటీ నియామాలను ఇష్టానుసారంగా చేపట్టారు. వాస్తవంగా గత నెలలోనే సెక్యూరిటీ సిబ్బందిని తొలగిస్తామని ఆస్పత్రి యాజమాన్యానికి మెయిల్‌ వచ్చింది. సీనియారిటీ జాబితాను యాజమాన్యం కోరినా.. సదరు జయబాలాజీ  ఏజెన్సీ తప్పులతడకగా సీనియారిటీ జాబితాను ఇచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయం కొందరు అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఏజెన్సీతో అధికారులు కుమ్మక్కై ఈ అక్రమ బాగోతానికి తెరలేపారన్న విమర్శలున్నాయి.

మరిన్ని వార్తలు