ఎవరేమైపోతే మాకేంటి?

28 Oct, 2018 09:06 IST|Sakshi

చంపావతిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు

నాతవలస, ఆర్‌.ముంగినాపల్లి రేవులనుంచి దర్జాగా తరలింపు

ఊట బావులు, వంతెన స్తంభాలకు ఆనుకుని తవ్వకాలు

ప్రశ్నించే వారిపై దాడికి యత్నిస్తున్న అక్రమార్కులు

తెరవెనుక అధికార పార్టీనేతల ప్రోత్సాహమే కారణం

పల్లెల్లోకి వెళ్లాల్సిన నీటిసరఫరాకు ఆటంకం కలుగుతుందా... అయితే మాకేంటి?
వంతెన స్తంభాలు బలహీనపడి వంతెన కూలిపోయే ప్రమాదముందా... అయితే మాకేంటి?

నదిలో నీటి ప్రవాహానికి అవరోధం 
కలుగుతుందా... అయితే మాకేంటి?

తవ్వకాల వల్ల ఏర్పడిన గోతుల్లో 
పడి పశువులు... మనుషులు ప్రాణాలు 
కోల్పోతారా... అయితే మాకేంటి?

ఈ క్షణం తమ పబ్బం గడచిపోతే చాలన్నదే వారి ధ్యేయంలా ఉంది. కాసుల వేట 
సాగిపోతోందన్నదే వారి లక్ష్యంలా ఉంది. ఇదీ చంపావతి నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వేస్తున్న అక్రమార్కుల తీరు.

డెంకాడ: విశాఖ – శ్రీకాకుళం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వంతెన ప్రాంతం... అదీ పట్టపగలు... యథేచ్ఛగా ఇసుక తవ్వకం సాగిపోతోంది. లక్షల్లో వ్యాపారానికి వేదికగా నిలుస్తోంది. ఏదో జాతరలా ట్రాక్టర్లను నదిలోకి దింపేసి దర్జాగా ఇసుక నింపేసి... తరలించేస్తున్నారు. కానీ వారిని అడ్డుకునేందుకు ఏ ఒక్కరూ చొరవ తీసుకోవడం లేదు. అధికారులు ఎందుకో చేష్టలుడిగి చూస్తున్నారు. అక్కడే మూడు మండలాలకు తాగునీటిని అందించే ఇన్‌ఫిల్టర్‌ బావులు, వంతెన కోసం నిర్మించిన స్తంభాలు చుట్టూ దొలిచేస్తున్నారు. మండలంలోని నాతవలస వద్ద ఉన్న చంపావతి నదిలో డెంకాడ మండలం నాతవలస, సింగవరం, అక్కివరం గ్రామాలకు చెందిన రక్షిత మంచినీటి పథకం బోర్లు ఉన్నాయి. అలాగే భోగాపురం మండల కేంద్రానికి చెందిన రక్షిత తాగునీరు సరఫరా చేసే బోరు ఇక్కడే ఉంది. వీటికి తోడు పూసపాటిరేగ మండలంలోని 32 గ్రామాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టు బోరు కూడా ఇక్క డే ఉంది. వీటికి అతిసమీపంలో విశాఖపట్నం–శ్రీకాకుళం జాతీయ రహదారిపై నిర్మించిన వంతెనలు కూడా అక్కడే ఉన్నాయి.

 ఇక డి.కొల్లాం పం చాయతీలోని ఆర్‌.ముంగినాపల్లి బ్రిడ్జి సమీపంలో ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. ఇక్కడ డెం కాడ మండలానికి చెందిన రక్షిత మంచినీటి పథకానికి చెందిన బోర్లున్నాయి. దీని ద్వారా డెంకాడ మండలంలోని 22 గ్రామాలకు, పూసపాటిరేగ మండలంలోని 5 గ్రామాలకు తాగునీరు సరఫరా జరుగుతోంది. దీనికి తోడు పూసపాటిరేగ మండలంలోని కుమిలి, డెంకాడ మండలంలోని ఆర్‌. ముంగినాపల్లి, చొల్లంగిపేట తదితర గ్రామాలకు చెందిన రక్షిత మంచినీటి పథకం బోర్లు ఇక్కడే  ఉన్నాయి. ఇక్కడ ఇసుక తవ్వకాల వల్ల ఈ బోర్లలోకి ఊట నీరు వచ్చే అవకాశం లేదు.వంతెన స్తం భాలు బలహీన పడితే వంతెన నిలిచే అవకాశం లేదు. కానీ ఇవేవీ అక్రమార్కులకు పట్టడం లేదు.
 
వాల్టా చట్టానికి తూట్లు
వాల్టా చట్టం ప్రకారం రక్షిత మంచినీటి బావులు, బ్రిడ్జిలు వంటివి ఉన్న ప్రాంతం నుంచి 5 వందల మీటర్ల వరకూ ఎలాంటి తవ్వకాలు చేయరాదు. అలా తవ్వకాలు చేపడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అధికారం అధికార యంత్రాంగానికి ఉంది. పర్యవేక్షణ లేకపోవడం, చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు చలరేగిపోతున్నారు. బావులు ఉన్న చోట ఇసుక తవ్వకాలు చేస్తే చాలా ప్రమాదం ఉంది. రక్షిత మంచినీటి బావుల చుట్టు ఇసుక ఉంటే నీరు ఇంకి బావిలోకి నీరు వెళ్తుంది. దాని ద్వారా గ్రామాలకు సరఫరా అవుతుంది. అలాకాకుండా బావుల వద్ద ఇసుక తవ్వకాలు చేపడితే నదిలో ప్రవహించే చెత్తనీరు కూడా బావుల్లోకి నేరుగా చేరుతుంది. నీరు కలుషితం అవుమౌతుంది. బావుల చుట్టూ ఇసుక తీసేయడం వల్ల భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోయి వేసవికి తాగునీటి సమస్య ఏర్పడుతంది. దీంతో ప్రజలకు అన్ని విధాలుగా నష్టం ఏర్పడుతుంది. 

ప్రశ్నిస్తే ఎదురు దాడులు
నాతవలస వద్ద మూడు మండలాలకు చెందిన రక్షితమంచినీటి బావులు ఉన్నాయి. నాతవలస పథకానికి కూడా బోరు ఇక్కడే ఉండటంతో బోరు చుట్టూ ఇసుక తవ్వేస్తే గ్రామస్తులు తాగునీటికి ఇబ్బంది పడతారని అడిగినందుకు ఇసుక అక్రమంగా తవ్వేస్తున్న వ్యక్తి చేతిలో పారపట్టుకుని నా భర్త వెంకటరమణపైకి వచ్చారు. 50 ట్రాక్టర్లతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా బోర్లు ఉన్నాయన్న ఇంకితం లేకుండా తవ్వేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. 
– బమ్మిడి లక్ష్మి, మాజీ సర్పంచ్, నాతవలస. 

ఇలా తవ్వడం నేరం
చంపావతి నదిలో బావులు, బ్రిడ్జిలకు చుట్టూ 5 వం దల మీటర్ల వరకూ ఎవరూ ఎలాంటి తవ్వకాలు చే యరాదు.అలాగే తవ్వకాలు చేస్తే వాల్టా చట్టం ప్రకా రం నేరం. అలాంటి వాహనాలను సీజ్‌ చేసి, యజ మానులపై కేసులు నమోదు చేస్తాం. ఇసుక అక్రమ రవాణా నియంత్రించడంలో పోలీస్, రెవె న్యూ, భూగర్భ గనులశాఖ ఇలా కొన్ని శాఖలకు బా ధ్యత ఉంది. వీటిని నియంత్రించేందుకు రెవెన్యూశాఖ పరంగా చర్యలు తీసుకుంటాం. పోలీసులు కూడా ఇలాంటి అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. దీనిపై కలెక్టర్‌కు విన్నవిస్తాం. 
– సీహెచ్‌.లక్ష్మణప్రసాద్, తహశీల్దార్, డెంకాడ  

మరిన్ని వార్తలు