అయ్యా ! నేను బతికే ఉన్నా

30 Oct, 2018 12:50 IST|Sakshi
అధికారులకు ఫిర్యాదు చేస్తున్న బాధితుడు నీరుకొండ అప్పలరాజు (తెల్లచొక్కా వేసుకున్న వ్యక్తి)

చనిపోయాడంటూ ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించిన అధికారులు

ఇదెక్కడి అన్యాయమంటూ రెవెన్యూ అధికారులను ప్రశ్నించిన బాధితుడు

పశ్చిమగోదావరి , నిడదవోలు: బతికి ఉండగానే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల పేర్లను మృతి చెందారని పేర్కొంటూ ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తీసెయ్యడమే పనిగా పెట్టుకున్నారు. పట్టణంలోని ఒకటో వార్డు లింగంపల్లికి చెందిన నీరుకొండ అప్పలరాజు సాధారణ పౌరుడు. ఆయన బతికి ఉండగానే చనిపోయినట్లుగా జాబితా నుంచి పేరు తొలగించారు. దీంతో బాధితుడు తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో తన గోడు వెళ్లబోసుకున్నారు.

అయ్యా నేను బతికే ఉన్నాను. నా ఓటు పునరుద్ధరించండి అంటూ తహసీల్దారు ఎం. శ్రీనివాసరావుకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా  వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల కన్వీనర్లు మద్దిపాటి ఫణీంద్ర, అయినీడి పల్లారావులు విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారి ఓట్లను టీడీపీ నాయకులు కావాలని తొలగిస్తున్నారని ఆరోపించారు. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని టీడీపీ నాయకులు రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం శోచనీయమన్నారు.

మరిన్ని వార్తలు