కొలువయ్యారు

4 Jul, 2014 01:07 IST|Sakshi
కొలువయ్యారు

- నగర, ‘పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారం
- నరసాపురం మినహా అన్నిచోట్లా ఏకగ్రీవమే

సాక్షి, ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, తణుకు, కొవ్వూరు పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో పాలకవర్గా లు కొలువుతీరారు. ఏలూరులో 50 మంది కార్పొరేటర్లు, మిగిలిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 241 మంది కౌన్సిలర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఏలూరు మేయర్, మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక, ఆ వెంటనే ఏలూరు డెప్యూటీ మేయర్, మునిసిపల్ వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వ హించారు. నరసాపురం మినహా అన్నిచోట్లా  ఎన్నికలు ఏకగ్రీవమయ్యూయి. రాజకీయ పార్టీల తరఫున విప్‌లను ఎన్నుకున్నారు. అన్నిచోట్లా ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం, ఎన్నికలు జరిగాయి.
 
సారథులు వీరే : ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌గా షేక్ నూర్జహాన్‌డెప్యూటీ మేయర్‌గా ఏడాదిన్నర కాలానికి చోడే వెంకటరత్నంను ఎన్నుకున్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు. భీమవరం మునిసిపల్ చైర్మన్‌గా కొటికలపూడి గోవిందరావు (చినబాబు), వైస్ చైర్మన్‌గా ముదునూరి సూర్యనారాయణరాజు ఎన్నికయ్యారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్‌గా బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా గొర్రెల శ్రీధర్ ఎంపికయ్యూరు.

పాలకొల్లు చైర్మన్‌గా వల్లభు నారాయణమూర్తి, వైస్ చైర్‌పర్సన్‌గా కర్నేని రోజారమణి ఎన్నికయ్యూరు. తణుకు చైర్మన్‌గా దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్‌గా మంత్రిరావు వెంకటరత్నం ఎంపికయ్యారు. కొవ్వూరు చైర్మన్‌గా సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), వైస్ చైర్మన్‌గా దుద్దుపూడి రాజా రమేష్‌ను ఎన్నుకున్నారు. ఇక్కడ వైస్‌చైర్మన్ పదవిని బీసీకి కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. నాయకులు సర్ధిచెప్పడంతో శాంతిం చారు.

నిడదవోలు చైర్మన్‌గా బొబ్బా కృష్ణమూర్తి, వైస్ చైర్మన్‌గా పేరూరి సాయిబాబా ఎన్నికయ్యారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ హాజరై పదవులు చేపట్టిన వారిని అభినందించారు. జంగారెడ్డిగూడెం చైర్‌పర్సన్‌గా బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్‌గా అట్లూరి రామ్మోహనరావును ఎన్నుకున్నారు.
 
ఎంపీ, ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ల సాయంతో...
నరసాపురంలో 14 వార్డులను టీడీపీ, మరో 14 వార్డులను వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, మూడుచోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ముగ్గురు ఇండిపెండెంట్లు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ బలం 19కి చేరింది. దీంతో టీడీపీ నుంచి పసుపులేటి రత్నమాల చైర్‌పర్సన్‌గా, పొన్నాల నాగబాబు వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు