సమ్మె వీడని జూడాలు, వైద్య సేవలకు తీవ్ర అంతరాయం

1 Aug, 2013 08:40 IST|Sakshi
సమ్మె వీడని జూడాలు, వైద్య సేవలకు తీవ్ర అంతరాయం

అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. జూనియర్ వైద్యుల సమ్మెతో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లోని ఓపీ, ఐపీ, ఎంవోటీ(మైనర్ ఆపరేషన్ థియేటర్), ఈవోటీ (ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్) విభాగాల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మంగళవారం కూడా జూడాలు మూకుమ్మడిగా విధులను బహిష్కరించడంతో సాధారణ, అత్యవసర వైద్యసేవలు నిలిచిపోయాయి. శస్త్రచికిత్సలు సైతం వాయిదా పడ్డాయి. పాలకవర్గం ఆదేశాల మేరకు మెడిసిన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సర్వీస్ పీజీలు, హౌస్ సర్జన్లను జూడాలు అడ్డుకుని, వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు వైద్యసేవలు పూర్తిగా నిలిచి పోయాయి. ఆసుపత్రి పాలకవర్గం విన్నపం మేరకు కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన 27 మంది క్లినికల్, నాన్ క్లినికల్ వైద్యులు మంగళవారం ఉస్మానియాలో వైద్య సేవలందించారు. సర్వీస్ పీజీలు, హౌస్ సర్జన్లతో పాటు అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, అసోసియేట్ ఫ్రొఫెసర్లు అందుబాటులో ఉండాలని సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాందాస్ ఆదేశాలు జారీ చేశారు.
 
 గాంధీలో రోగుల పాట్లు
 గాంధీ ఆస్పత్రి: జూనియర్ డాక్టర్ల సమ్మెతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాలనాయంత్రాంగం అరకొర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చే యడంతో వైద్య సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరి గింది. గాంధీలో సుమారు 500 మంది జూడాలు, హౌస్‌సర్జన్లు సమ్మెలో పాల్గొన్నారు. మంగళవారం అత్యవసర శస్త్ర చి కిత్సలు మినహా సాధారణ ఆపరేషన్లు వాయిదా పడ్డాయి. కొంతమంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు.
 
 ‘ఎస్మా’ పరిధిలో లేము: జూడాల సంఘం
 తాము వైద్య విద్యార్థులమని, ‘ఎస్మా’ పరిధిలో లేమని జూనియర్ డాక్టర్ల సంఘం గాంధీ శాఖ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం ఉదయం వారు మీడియాతో మాట్లాడుతూ 93,107,834 జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు