విద్యుత్ కోతలతో కుదేలు

1 Apr, 2014 01:34 IST|Sakshi
విద్యుత్ కోతలు

 నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్:జిల్లాలో విద్యుత్ కోతలు అధికమయ్యాయి. అధికార అనధికారిక కోతలతో జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. పల్లెల్లో పగలంతా కరెంటు ఉండటం లేదు. పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నా అధికారులు ఇష్టారాజ్యంగా కోతలు అమలు చేయడం సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో నిత్యం తెల్లవారు జామున నెల్లూరు నగరంతో పాటు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికే మండల, పట్టణాల్లో కరెంటు మీద ఆధారపడి చిరు వ్యాపారం చేసుకునే వారు కుదేలవుతున్నారు. ఎండలు పెరగకముందే ఈ రకంగా ఎడా పెడా విద్యుత్ కోతలను విధిస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణాల్లో అధికారికంగా గంట అన్నది అనాధికారికంగా మరో గంట కోత విధిస్తున్నారు. గ్రామాల్లో అయితే పగలంతా కరెంటు ఉండటం లేదు.

 పల్లెల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఈ కోతలతో తాగునీటి పథకాలకు ఆటంకం ఏర్పడుతోంది. వేసవి ప్రతాపం ప్రారంభం కాకముందే ఈ విధంగా కోతలు ఉంటే మండు వేసవి ఏప్రిల్, మే నెలల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 పెరుగుతున్న ఎండలు...

 వారం రోజుల నుంచి పగటి ఉష్టోగ్రతల్లో వ్యతాసం ఉంటోంది. ఎండ వేడిమి పెరుగుతోంది. రోజుకు అత్యధికంగా 39 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుండడంతో ప్రజలు వేసవి తాపానికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏసీల వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోంది.

 పెరిగిన ఇండస్ట్రియల్ లోడు..

 జిల్లాకు రోజు 9.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కోటాగా ఇస్తున్నారు. ఇందులో నగర వినియోగం 20 శాతంకు పైగా ఉంటోంది. జిల్లాలో గృహవిద్యుత్ కనెక్షన్లు 8.84 లక్షలు, కమర్షియల్ కనెక్షన్లు 71వేలు, వ్యవసాయ కనెక్షన్లు 1.35 లక్షలు కాగా, ఎల్‌టీ(పరిశ్రమల) సర్వీసులు 41 వేల వరకు ఉన్నాయి.

 ఇటీవల కాలంలో జిల్లాలో ఇండస్ట్రియల్ లోడు గణనీయంగా పెరిగింది. ఇందుకు తగ్గట్టుగా జిల్లాకు కోటాను కేటాయించడం లేదు. సెంటర్ పవర్‌గ్రిడ్ నుంచి ఏపీఎస్‌పీడీసీఎల్‌కు దక్కే వాటా 22 శాతం వరకు ఉంటుంది. ఈ శాతం 25కు పెంచాలని అధికారులు కోరినా ఫలితం ఉండటం లేదు.

 వ్యవసాయానికి 7.00 గంటలు విద్యుత్ ఇస్తామని అధికారులు చెబుతున్నా కోతలు పెడుతుండటంతో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి.  రాత్రి 5 గంటలు, పగలు రెండు గంటలు విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. విద్యుత్ సరఫరా వేళలు ఇలా ఉంటున్నాయి. ఏ గ్రూపు పరిధిలో రాత్రి 23.15 గంటల నుంచి 4.15 వరకు, మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4.15 వరకు, బీ గ్రూపు పరిధిలో  ఉదయం 4.15 నుంచి 9.15 వరకు, రాత్రి 23.15 నుంచి 1.15 వరకు, సీ గ్రూపు పరిధిలో ఉదయం 9.15 నుంచి 14.15 వరకు, రాత్రి 1.15 నుంచి 3.15 వరకు, డీ గ్రూపు పరిధిలో మధ్యాహ్నం 2.10 నుంచి సాయంత్రం 7.10 వరకు, రాత్రి 3.15 నుంచి 5.15 వరకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు.

 అయితే నిర్దేశించిన కోతల సమయానికి కరెంటు కోతలకు సంబంధం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెల్లో సాగు, తాగునీటి కొరత అధికమవుతోంది. విద్యార్థులకు పరీక్షల సమయంలో తీవ్ర ఆందోళన గురికావాల్సి వస్తోంది. పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సైతం కరెంటు కష్టాలు తప్పడం లేదు.

మరిన్ని వార్తలు