ప్రధాని పీఠం కోసమే మొసలి కన్నీళ్లు | Sakshi
Sakshi News home page

ప్రధాని పీఠం కోసమే మొసలి కన్నీళ్లు

Published Tue, Apr 1 2014 1:33 AM

ప్రధాని పీఠం కోసమే మొసలి కన్నీళ్లు - Sakshi

బీజేపీపై సోనియా ధ్వజం
ఆ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
యూపీఏ చేసినంత అభివృద్ధి మరే ప్రభుత్వం చేయలేదు

 
 
 మేవాట్ (హర్యానా): ప్రధాని పీఠం దక్కించుకోవడమే బీజేపీ లక్ష్యమని ప్రతిపక్షంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగిస్తూ.. బీజేపీ, ఆపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విమర్శల దాడిని కొనసాగించారు. ఈ మధ్య కాలంలో బీజేపీ నాయకులు వేషాలు మారుస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలు కేవలం దేశాభివృద్ధి కోసమే కాదని, కష్టనష్టాలకోర్చి స్వాతంత్య్ర సమరయోధులు, తాతముత్తాతలు మనకు ప్రసాదించిన రాజ్యాం గాన్ని పరిరక్షించడానికి కూడా అని సోనియా చెప్పారు.

లౌకికవాదులుగా ఎలా మెలగాలో రాజ్యాంగం మనకు నేర్పిందని, దానిని ఎలా పరిరక్షించుకోవాలో కూడా చెప్పిందని వివరించారు. భారతదేశం ఏ కొద్దమందిదో కాదని, ప్రజలందరి హక్కులు రక్షించడానికి కాంగ్రెస్ పోరాడుతుందని హామీనిచ్చారు. కుల, మత, ప్రాంత, భాష భేదాలు లేని లౌకిక దేశ నిర్మాణం గురించి తమ పార్టీ పాటుపడుతుందని చెప్పారు. మన్మో హన్ సర్కారుపై ప్రశంసలు కురిపిస్తూ.. పదేళ్ల కాలంలో యూపీఏ చేసినన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మరే ప్రభుత్వం చేయలేదన్నారు. ఆ అభివృద్ధికి మీరే సాక్షులంటూ సభికులనుద్దేశించి చెప్పారు. గతంలో తామిచ్చిన హామీలు.. గ్రామీణ ఉద్యోగ పథకం, విద్యాహక్కు చట్టం, సమాచారహక్కు చట్టం తదితరాలన్నింటిని నెరవేర్చామన్నారు. ప్రస్తుత మేనిఫెస్టోలో అందరికీ ఆరోగ్య పథకంతో పాటు మహిళలపై హింసను నిరోధించడానికి కఠినమైన చట్టాలను చేస్తామనే హామీ ఇచ్చామని కాంగ్రెస్ అధ్యక్షురాలు చెప్పారు.

Advertisement
Advertisement