తిరుమలలో భక్తుల ఆందోళన

21 Jul, 2014 00:39 IST|Sakshi
తిరుమలలో భక్తుల ఆందోళన

రూ. 300 టికెట్ల క్యూ నిలిపివేతపై అభ్యంతరం
 
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తులు ఆందోళనకు దిగారు. భక్తుల రద్దీ కారణంగా రూ.300 టికెట్ల దర్శన క్యూను ఉదయం 10 గంటలకే నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆ సమాచారాన్ని శనివారం నుంచే వివిధ ప్రసార సాధనాల ద్వారా ప్రసారం చేయించింది. ఆ మేరకు ఆదివారం ఉదయం 10 గంటల వరకు లేపాక్షి వద్ద ప్రవేశ మార్గాన్ని మూసివేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన శంకర్, అతని మిత్ర బృందంలోని ఐదుగురు ఇతర భక్తులను రెచ్చగొట్టారు. అంతా కలసి భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. దీంతో వారందరినీ దర్శనానికి అనుమతించారు.

అనంతరం హైదరాబాద్ భక్తులను అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి విచారించి, భక్తులను రెచ్చగొట్టటం సరికాదని హెచ్చరించారు. డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ వారికి సుపథం క్యూ నుంచి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఇదిలా ఉండగా, ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు 45 వేల మంది దర్శించుకున్నారు. 31 కంపార్ట్‌మెంట్లలో నిండి ఉన్న భక్తులకు 23 గంటలు, కాలిబాట భక్తులకు 12 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది.
 
 

మరిన్ని వార్తలు