మహిళలపై ప్రతాపమా...

31 Oct, 2017 11:51 IST|Sakshi
మహిళా సంఘం నాయకురాలిని బలవంతంగా వ్యాన్‌ ఎక్కిస్తున్న పోలీసులు

అందాల పోటీ వద్దంటే పోలీసులతో బెదిరింపులా...

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

అందాల పోటీల పేరుతో అతివలను ఆటబొమ్మలను చేయొద్దన్న డిమాండ్‌తో రెండో రోజూ ఆందోళనకు దిగిన మహిళా సంఘాల ప్రతినిధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆందోళన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత రేగింది. మద్దిలపాలెం జంక్షన్‌లో సోమవారం ఉదయం తలపెట్టిన నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. వాహనాల్లో వచ్చిన సంఘాల ప్రతినిధులను వాహనాలు దిగకుండా అడ్డుకున్నారు. ప్రతిఘటించిన వారిని ఈడ్చుకెళ్లి, ఎత్తుకెళ్లి పోలీసు వాహనాల్లోకి నెట్టి.. త్రీటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. వారందరినీ సాయంత్రం వరకు అక్కడే ఉంచి.. అనంతరం విడిచిపెట్టారు.. దీనికి నిరసనగా ఆడవాళ్లను ఆటబొమ్మలను చేయొద్దన్నందుకు అరెస్టులు చేయడం సిగ్గచేటంటూ మహిళా సంఘాలు పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించాయి.

మద్దిలపాలెం (విశాఖ తూర్పు): రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైపోతుంది. అన్యాయాన్ని ప్రశ్ని స్తున్న మహిళా సంఘాలపై పోలీసులు జూలుం ప్రదర్శిస్తున్నారు. ఇదేం పాలనరా.. బాబు అనే దుస్థితికి మన రాష్ట్ర పాలన దిగజారిపోయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. నగరంలో అందాల పోటీలను రద్దు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మద్దిలపాలెం కూడలి తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసనకు సమాయత్తమైన మహిళా సంఘాల ప్రతినిధులను అరెస్టు చేయడంపై  ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన మహిళా సంఘాల ప్రతినిధులను మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో కలిసి మద్దతు తెలిపారు. ఆమెతోపాటు వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ, పీలా వెంటకలక్ష్మి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, మైనార్టీ సెల్‌ నగర ప్రధాన కార్యదర్శ సబీరాబేహంలు కలిసి పరామర్శించారు.
మహిళ సంఘాలపై దాడులు అమానుషం
మహిళలకు రక్షణలేని నేటి సమాజంలో.. అందాల పోటీలను నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.రామూర్తి,పి.వి.రమణ ఒక ప్రకటనలో ఖండించారు.

గొంతు నొక్కితే ప్రభుత్వానికి పతనం తప్పదు
అందాల పోటీలు నిర్వహించి మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని అఖిల పక్ష మహిళా సంఘాలు నిరసన చేపడితే పోలీసులు బలవంతంగా అరెస్టులు చేయడం అన్యాయమని సీపీఐ గ్రేటర్‌ కార్యదర్శి దేవకొండ మార్కెండేయులు అన్నారు. ఉద్యమకారులు గొంతునొక్కె ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు.

 కేసులు బనాయించం దుర్మార్గం
అందాల పోటీలు వద్దని నిరసన తెలిపిన మహిళా సంçఘాలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని సీఐటీయూ నగర అధ్యక్ష,కార్యదర్శిఆర్‌.కె.ఎస్‌.కుమార్, జగ్గునాయుడు అన్నారు. మహిళాసంఘాల అరెస్టు తీరు చూసి సభ్యసమాజం తలదించుకుంటుందన్నారు.

అరెస్టు చేయడం తగదు
ఆందాల పోటీలు వద్దన్నందుకు మహిళా సంఘాల నాయకుల్ని అరెస్టు చేయడం దుర్మార్గమని ఐద్వా ఉపాధ్యక్షురాలు బి.పద్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథ, నగర కార్యదర్శి బి.గంగారావు, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. అందగత్తెల పోటీలు నిర్వహించొద్దని మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు అందగత్తెల పోటీల పోస్టర్‌ ఆవిష్కరించడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ మహిళలను గౌరవించే పద్దతి ఇదేనా?, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ అందాల పోటీలు వద్దన్నందుకు పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయంచడం తగదన్నారు.
పీవోడబ్ల్యూ నాయకులు లక్ష్మి నిర్బంధం

మరిన్ని వార్తలు