ఆరిపోతున్న ఆశా జ్యోతులు

19 Jun, 2018 08:39 IST|Sakshi
మదనపల్లె: బాలాజి మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు(ఫైల్‌)

 రోడ్డు ప్రమాదాల్లో కొందరు..

విధి వంచితులై మరికొందరు..

తల్లిదండ్రుల తప్పులకు బలవుతున్న ఇంకొందరు

సంయమనం పాటించాలంటున్న మానసిక నిపుణులు

పిల్లలూ.. దేవుడు చల్లని వారే.. కల్లకపట మెరుగని కరుణామయులే.. అని ఒక సినీ కవి అన్నాడు. ఇది అక్షర సత్యం. బోసి నవ్వుల పసిపాపలు అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి దైవ సమానులైన పిల్లలు కొందరి ప్రవర్తన వల్ల జీవితాలను కోల్పోతున్నారు. మరికొందరు తమ స్వార్థం కోసం కన్నపేగులను కాలరాస్తున్నారు. బాహ్య ప్రపంచాన్ని చూడకుండానే చిదిమేస్తున్నారు. అలాగే కన్నవారి కలల పెన్నిధులైన యువకులు బలి అవుతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు మనసున్న వారిని కలచివేశాయి.

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె మండలం చీకలబైలు గ్రామం జమ్ముకుంటపల్లెలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ఉగాది పండగ రోజు మామిడి ఆకులు కోసుకువచ్చేందుకు వెళ్లిన రమణ కుమారుడు బాలాజీ(14), నరసింహులు కుమారుడు హర్ష(4), రాజశేఖర్‌ కుమారుడు అజయ్‌(3)ను బెంగళూరు వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. బాలాజీ అక్కడికక్కడే మృతిచెందగా హర్ష, అజయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యు ఒడికి చేరారు. ఇందులో డ్రైవర్‌ అతివేగం కారణమని పోలీసులు తెలిపారు. పిల్లల మృతితో మూడు కుటుంబాల్లో వంశాం కురం లేకుండా పోయింది.

బసినికొండ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న డ్రామాలోళ్ల శివయ్య, రాణి దంపతుల కుమార్తె సుమతి(11) ఈ ఏడాది జనవరిలో పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా కాలు జారి పెద్దగుండు వ్యవసాయ బావిలో పడింది. స్థానికులు బాలికను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. బావికి రక్షణ గోడ నిర్మించాలని పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోలేదు. వారి నిర్లక్ష్యానికి ఫలితం ఒక నిండు ప్రాణం బలి.
తొట్టంబేడు మండలం పిల్లమేడు గ్రామానికి చెందిన మెరిమి వెంకటసుబ్బయ్య కుమార్తె ఎం.సుమలత(15) వాల్మీకిపురం బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతూ సెలవుల్లో ఇంటికి వెళ్లింది. ఆమెను అన్న సురేష్‌ తిరిగి పాఠశాలలో వదిలి వెళ్లాడు. గంటల వ్యవధిలోనే సుమలత సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు యత్నించింది. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక లోలోపల అనుభవిస్తున్న సంఘర్షణను తల్లిదండ్రులు గమనించకపోవడంతో భావి భారత ఆశా కిరణం అనంత వాయువుల్లో కలిసిపోయింది.

ఈ ఏడాది మార్చి 9న సీటీఎం సమీపంలోని క్వారీలో రిగ్గు బండి దూసుకెళ్లి అస్సాం రాష్ట్రం చీరంగ్‌ జిల్లా, బిజిని మండలం, చిక్‌పార్‌కు చెందిన ఫయానల్‌ బాసుమత్రి కుమారుడు ఉడంగ్‌ బాసుమత్రి(18) దుర్మరణం చెందాడు. అతను పొట్ట చేతపట్టుకుని ఇక్కడికి వచ్చాడు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కడుపుకోతని మిగిల్చింది. తమకు దిక్కెవరని ఆ తల్లిదండ్రులు చేస్తున్న ఆర్తనాదాలు అన్నీ ఇన్నీకావు.

రామకుప్పం మండలం కవ్వంపల్లికి చెందిన పవిత్ర మరొక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో తమ సంబంధానికి పిల్లలు దినేష్‌రెడ్డి (6), రుత్విక్‌ రెడ్డి (3) అడ్డుగా ఉన్నారని ఆ తల్లి భావించింది. కసాయిగా మారి ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలను గతేడాది కడతేర్చింది.

మదనపల్లె మండలం చీకిలబైలు పంచాయతీ శాస్త్రులగడ్డకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ మంజునాథ భార్య రెడ్డిరాణి (28) తన ఇద్దరు పిల్లలు గౌతమి (8), పూజిత (11)ను బావిలో తోసేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది.
ఇలాంటి హృదయ విదారక సంఘటనలు ఈ మధ్య కాలంలో జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు సుమారు 31 మంది పసిబిడ్డలు మృత్యువాత పడ్డారు. ఆత్మహత్యలు, వివాహేతర సంబంధాలు, హత్యల వల్ల కలిగే అనర్థాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విచ్ఛిన్నం
ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువయ్యాయి. ప్రియురాలి మోజులో పడి కుటుంబా లను పట్టించుకోవడం లేదు. అంతేగాక భార్యలను వేధింపులకు గురిచేస్తున్నారు. మరికొం దరు భార్య అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళలు కూడా భర్తలను ప్రియుడితో కలిసి హత్య చేస్తున్నారు. ఈ నెలలో పీటీఎం మండలంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసింది. తద్వారా కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. 

ఆర్థిక ఇబ్బందులతో కఠిన నిర్ణయాలు
భర్త తాగుడుకు బానిసై కుటుంబం గురించి పట్టించుకోకపోవడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు పడలేక కొందరు తనువు చాలించాలని నిర్ణయించుకుంటున్నారు. పంతం నెగ్గించుకోవాలనే నెపంతో మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాము చనిపోయిన తర్వాత బిడ్డలు ఏమవుతారోనని కొందరు తల్లులు కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నారు.

క్షణికావేశంతో అనర్థాలు
కొందరు మద్యానికి బానిసలుగా మారి కుటుంబాలను పట్టించుకోవడం మానేస్తున్నారు. దీనికితోడు భార్యలతో గొడవ పడుతున్నారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన మహిళలు క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. శరీరంపై కిరోసిన్‌ పోసుకుని కొందరు, బావిలో దూకి మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. నిండు జీవితాలను నాశనం చేసుకుంటూ తమ పిల్లలను అనాథలను చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు మండలం పేయన కండ్రిగలో వివాహిత ఇద్దరు బిడ్డలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మగ బిడ్డ పుట్టలేదని భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధింపులు తాళలేకే ఆ తల్లి బలవన్మరణానికి పాల్పడింది.

మరిన్ని వార్తలు