అర్‌వింద్‌ ఫ్యాషన్స్‌ లిస్టింగ్‌ 

9 Mar, 2019 00:41 IST|Sakshi

5 శాతం లాభంతో రూ.621 వద్ద ముగింపు  

న్యూఢిల్లీ: అర్‌వింద్‌ కంపెనీ నుంచి విడివడిన(డీమెర్జ్‌ అయిన) అర్వింద్‌ ఫ్యాషన్స్‌ స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం లిస్ట్‌ అయింది. లాల్‌భాయ్‌ గ్రూప్‌నకు చెందిన ఈ దుస్తులు, యాక్సెసరీల కంపెనీ రూ.592 వద్ద స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.621 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,603 కోట్లుగా నమోదైంది. అంతర్జాతీయ బ్రాండ్లు–టామీ హిల్‌ఫిగర్, కాల్విన్‌ క్లెయిన్, యూస్‌ పోలో, అసోసియేషన్, యారో తదితర అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులను ఈకంపెనీ విక్రయిస్తోంది. ఈ కంపెనీ అన్‌లిమిటెడ్‌ పేరుతో దుస్తుల రిటైల్‌ చెయిన్‌ను,  సెఫోరా పేర్లతో సౌందర్య ఉత్పత్తుల విక్రయాలను నిర్వహిస్తోంది.  అర్వింద్‌ కంపెనీ.. బ్రాండెడ్‌ దుస్తుల వ్యాపారాన్ని అర్వింద్‌ ఫ్యాషన్స్‌ పేరుతో, ఇంజినీరింగ్‌ విభాగాన్ని అనుప్‌ ఇంజినీరింగ్‌ పేరుతో డీమెర్జ్‌ చేసింది. ఈ నెల 1న అనుప్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది.  

ఫెయిర్‌ వేల్యూ నిర్ణయంలో గందరగోళం.. 
కొత్తగా ఒక కంపెనీ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లో లిస్ట్‌ అయ్యేటప్పుడు స్టాక్‌ ఎక్సే్చంజ్‌లు ‘ప్రి–ఓపెన్‌ యూజింగ్‌ కాల్‌ ఆక్షన్‌’ను నిర్వహిస్తాయి. 45 నిమిషాల పాటు జరిగే ఈ ధర అన్వేషణ ప్రక్రియలో ఇన్వెస్టర్లు ఎంత ధరకు ఈ షేర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో బిడ్‌లు దాఖలు చేస్తారు. ఎక్కువ మంది బిడ్‌ చేసిన ధరను ప్రారంభ ధరగా నిర్ణయిస్తారు. ఈ కంపెనీ ప్రారంభ ధరను స్టాక్‌ ఎక్సే్చంజ్‌లు రూ.590గా నిర్ణయించాయి.  కాగా అర్వింద్‌ ఫ్యాషన్స్‌ షేర్‌కు సరైన విలువ(ఫెయిర్‌ వేల్యూ) నిర్ణయంలో కొంత గందరగోళం నెలకొన్నది. ఈ కంపెనీ ఫెయిర్‌ వేల్యూ రూ.900 నుంచి రూ.1,300 రేంజ్‌లో ఉండగలదని అంచనాలున్నాయి. అయితే ధర అన్వేషణ ప్రక్రియలో లోపాల వల్ల ఫెయిర్‌ వేల్యూ చాలా తక్కువగా రూ.331గా నిర్ణయమైందని బ్రోకరేజ్‌ సంస్థలు అంటున్నాయి. ఫెయిర్‌ వేల్యూ మరింత ఎక్కువగా ఉండాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. ఫెయిర్‌ వేల్యూ రూ.1,400 గా ఉండాలని యాక్సిస్‌ క్యాపిటల్‌ పేర్కొంది. ఈ విషయమై కంపెనీ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు ఫిర్యాదు చేసింది. 

మరిన్ని వార్తలు