యుద్ధ వాగాడంబరం ప్రమాదకరం

9 Mar, 2019 00:42 IST|Sakshi

జాతిహితం 

ప్రతీకారం తీర్చుకోవడమనే భావన ఒక తెలివితక్కువ వ్యూహాత్మక భావోద్వేగం మాత్రమే. ప్రతీకారం మూర్ఖుల వాంఛ కాగా వివేకవంతులు చర్చకు, సంయమనానికి ప్రాధాన్యత ఇస్తారు. భారత్, పాక్‌ ఇరుదేశాల ప్రజల భావోద్వేగాలు సరేసరి. ప్రధాని సైతం బహిరంగ సభలో భారీ జనసందోహం మధ్య తన ఛాతీని గట్టిగా తడుతూ తన విధి తనను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎక్కువగా వేచి ఉండకుండా చేస్తోందని ప్రకటించడం పరిణతికీ, వివేచనకు చిహ్నం కాదు. యుద్ధోన్మాద రాజకీయాలకు సైనిక బలగాలను బలి తీసుకోవడం ఏమంత తెలివైన పని కాదు.

‘కిత్‌నే ఆద్మీ థీహై’ (అక్కడ ఎంతమంది శత్రువులున్నారు) అంటూ హిందీ సినిమాల్లో అతి భయంకరుడు, అదే సమయంలో ఆరాధనీయుడైన విలన్‌ గబ్బర్‌ సింగ్‌ మత్తులో ఊగుతున్న తన అనుచరులను ప్రశ్నించాడు. 1975లో రమేష్‌ సిప్పీ తీసిన క్లాసిక్‌ సినిమా షోలే లోనిదీ దృశ్యం. రెండు వారాల క్రితం భారత్‌–పాకిస్తాన్‌ మధ్య జరిగిన ఆ ‘90 గంటల యుద్ధం’ నేపథ్యంలో ఆ సినిమాలోని సంభాషణను మళ్లీ ఉపయోగిస్తున్నాను. లేదా, ఫిబ్రవరి 27 పరిణామాల అనంతరం మన రాజకీయ వ్యూహ ప్రక్రియ గబ్బర్‌సింగ్‌ తత్వంలోకి అడుగుపెడుతుండంలోని అవివేకాన్ని వర్ణించడానికి ఆ డైలాగ్‌ను వర్ణిస్తున్నాను. 

పాక్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడుల సంచలనం సద్దుమణిగిన తర్వాత కూడా, ఇప్పుడు మూడు ప్రశ్నలు మిగిలే ఉన్నాయి: మన బాంబులు/క్షిపణులు జైషే శిబిరాలపై దాడి చేశాయా లేదా? దాడి చేసి ఉంటే అవి ఎంతమందిని చంపాయి (అందుకే ఎంతమంది శత్రువులు ఉన్నారు అని ప్రశ్న)? మూడో ప్రశ్న. భారతీయ యుద్ధ విమానం పాకిస్తాన్‌కి చెందిన ఎఫ్‌–16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిందా లేదా? ఈ ప్రాథమిక అంశాన్ని ఇది విస్మరిస్తోంది. పైన లేవనెత్తిన మూడు ప్రశ్నలూ ప్రతీకార మానసికధోరణినే ప్రతిబింబిస్తున్నాయి. మన దేశం పరిమాణం, శక్తి, మనపై ఉన్న బాధ్యత రీత్యా చూస్తే ఇలాంటి ధోరణి నిజంగా దురదృష్టకరమైనది. అందుకే ఈ తత్వాన్ని గబ్బర్‌సింగ్‌ తత్వం అని పిలుస్తున్నాం. 

చివరకు మన ప్రధాని నరేంద్రమోదీ సైతం బహిరంగ సభలో భారీ జనసందోహం మధ్య తన ఛాతీని గట్టిగా తడుతూ తన విధి తనను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎక్కువగా వేచి ఉండకుండా చేస్తోందని ప్రకటించడం ద్వారా ఈ గబ్బర్‌సింగ్‌ తత్వానికి మరింత ఆజ్యం పోశారు. ఇది భారత వ్యూహాత్మక ప్రతిస్పందన ప్రమాదకరమైన రాజకీయీకరణకు స్పష్టమైన సంకేతం. ఇక రెండో అంశం. పాకిస్తాన్‌ని నిరోధించడానికి మీరు చేసినది సరిపోదన్న భావనకు ఇది స్పష్టమైన అంగీకారం. వైమానిక దాడిపై మన ప్రచారార్భాటాన్ని నేను మరీ ఎక్కువగా విమర్శిస్తూండవచ్చు కానీ వాగాడంబరం కూడా మీ అవకాశాలను పరిమితం చేయవచ్చని మర్చిపోవద్దు. మరోవైపున, ఈ సాహసోపేతమైన వైమానిక దాడులు ఇరుదేశాల మధ్య యుద్ద నియంత్రణకు తోడ్పడలేదని మన ప్రధాని భావిస్తున్నట్లయితే, మన ఉపఖండం ఎదుర్కోబోయే తాజా పరిస్థితి భారత్‌ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగానే ఉండవచ్చు. 

ఉగ్రవాదం–ప్రతీకారం–మళ్లీ ఉగ్రవాద పురోగతి, దాన్ని మళ్లీ దెబ్బతీయడం అనే క్రమం రెండడుగులు ముందుకు నడుస్తున్నట్లు కనిపించవచ్చు కానీ ఆధీన రేఖ పొడవునా దశాబ్దాలుగా వృధాగా సాగుతున్న రక్తపాత చర్యల కంటే ఇదేమంత భిన్నమైనది కాదు. తేడా అల్లా ఏమిటంటే గతంలోవలే చిన్న ఆయుధాలు, మోర్టార్లు, స్నైపర్‌ రైఫిల్స్, కమాండో–కత్తులు ఉపయోగించడానికి బదులుగా ఇప్పుడు యుద్ధ విమానాలు, మారణాయుధాలను ఉపయోగించడమే. రక్షణరంగ మేధావులకు, తరుణ వయస్కులకు ఇది సాహసకృత్యంగా కనిపించవచ్చు. దురదృష్టవశాత్తూ ఇది మనకు ఓటమి కాకపోవచ్చు కానీ మన వ్యూహా త్మక ప్రయోజనాలతో రాజీపడుతోంది. అనుకూలాంశాలను ముందుగా వెలికి తీద్దాం. గతంలో పార్లమెంట్‌పై దాడి, ముంబైలో ఉగ్రవాదుల నరమేధం వంటివి పుల్వామా దాడి కంటే భీకరంగా సాగి రెచ్చిగొట్టినా భారత్‌ ప్రతీకార చర్యలకు దిగలేదు. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ భారత్‌ ఇలాగే స్పందిస్తుందని అందరూ అంచనా వేసేవారు. ప్రపంచం కూడా విసుగెత్తిపోయింది. అందుకే ప్రత్యక్ష ప్రతీకారం ఇప్పుడు తార్కిక ఎంపిక అయిపోయింది. ప్రత్యేకించి బాలాకోట్‌పై వైమానికి దాడులు పాకిస్తాన్‌కు  మూడు ముఖ్యమైన సందేశాలను పంపాయి.

ఒకటి.. సహనంతో కూడిన పలు ఘటనల తర్వాత, పుల్వామాలో ఉగ్రవాదుల మతిహీన చర్యకు ప్రతిచర్యగా పాకిస్తాన్‌ భూభాగంలోనికి దూసుకొచ్చి భారత్‌ దాడి చేయగలదని స్పష్టమైంది. ఈ కోణంలో 1990 తర్వాత పాకిస్తాన్‌ చూపుతున్న అణ్వాయుధ బూచి గాలికెగిరిపోయింది. ఉగ్రవాదం ముగియలేదు కానీ, పాకిస్తాన్‌ ఈ కొత్త వాస్తవాన్ని పరిగణించాల్సిన పరిస్థితిని చవిచూస్తోంది. రెండు.. అలాంటి ప్రతీకారాన్ని తీసుకునే శక్తి, రహస్య సైనిక చర్యల గోప్యతను నిర్వహించే సామర్థ్యం భారత్‌కు ఉంది. ఇక మూడోది.. భారత్‌కు ప్రతీకార దాడులు చేసే హక్కు ఉందని ప్రపంచంలోని కీలకశక్తులు ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. తదనుగుణంగా  భారత్‌ కూడా తన వైపునుంచి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతం మనం ఆటను ఇలా ముగించాం. కాని దీనిలోని ప్రతికూలాంశాలను కూడా మనం పరిగణించాలి. ఇక్కడ సైతం మూడు ఉదాహరణలు ఉన్నాయి. దాడులు, ప్రతిదాడులు, భారత్‌ స్పందన అనేవి ఇరుదేశాల మధ్య సాంప్రదాయిక అసమానత్వం అనుకున్నంత బలంగా లేదని తేల్చిపడేశాయి. టెక్నాలజీ, ఆయుధాలు, సమర్థత వంటి అంశాల్లో ఈ రెండు పక్షాలూ కొన్ని సందర్భాల్లో తప్పితే దాదాపు సమాన స్థితిలో ఉంటున్నాయి. కానీ యుద్ధం చాలాకాలం కొనసాగినట్లయితే, భారత్‌ సులభంగా పాకిస్తాన్‌ను అధిగమించగలదు. క్లుప్తంగా చెప్పాలంటే భారత్‌ పాకిస్తాన్‌పై సాంప్రదాయకమైన ఆధిక్యతను కలిగి ఉంది. కాని ఆ దేశాన్ని కఠినంగా దండించే పరిస్థితి భారత్‌కు లేదు. 

కాందహార్‌ హైజాక్‌ ఘటనలో లాగే భారతీయ ప్రజాభిప్రాయం ఒక బలహీనమైన లింకుగా మళ్లీ నిరూపితమైంది. పాకిస్తాన్‌ కస్టడీలో ఒక భారత యుద్ధ ఖైదీ ఉన్నంతమాత్రానే అటు ఇటో తేల్చుకునే యుద్ధం చేయాల్సిందే అంటూ ప్రజలు ఉన్మాదంతో ఊగిపోయారు. గగనంలో సంకులయుద్ధం జరిగిన సాయంత్రానికి ‘అభినందన్‌ని వెనక్కు తీసుకురండి’ స్థానంలో ‘పాకిస్తాన్‌ని శిక్షించండి లేక నలిపివేయండి’ వంటి హ్యాష్‌టాగ్‌లు ట్విట్టర్‌లో వెల్లువెత్తాయి. ఉడీ తరహా సినిమాల్లో ప్రదర్శితమయ్యే ‘స్వదేశాభిమాన యుద్ధోన్మాదం’ తలకెక్కిన భారతీయ ప్రజారాశులు నిజమైన యుద్ధంలో ఇరుదేశాలూ లేక ఇరుపక్షాలూ నష్టపోతాయనే వాస్తవాన్ని విస్మరించాయి. కొన్నిసార్లు మనమే ఎదురుదెబ్బ తినొచ్చు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే, ప్రస్తుత సంక్షోభం ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా పాకిస్తాన్‌ పట్ల కాస్త సహనంతో, తక్కువ దండనాత్మక దృష్టితో కొత్త దృక్పథంతో వ్యవహరించాల్సి ఉందనే పాఠాన్ని భారత్‌కు నేర్పింది. కాబట్టి భారతీయ నాయకులు ఏదైనా విజయాన్ని సాధించడంపై మొదటగా దృష్టి పెట్టి తర్వాతే భావోద్వేగానికి స్థానం కల్పించాలి. ప్రస్తుత సంక్షోభం తాలూకూ పరిణామాలు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే సంభవిస్తాయి. చరిత్ర విరామాన్ని కోరుకోదు. అలాగే పాకిస్తాన్‌ వైఖరిని సులభంగా సంస్కరించడం కష్టం.

వాస్తవానికి ఇది కొత్త ప్రమాణం అయితే పాకిస్తాన్, అంతర్జాతీయ సమాజం కూడా  దాన్ని ఉపయోగించుకుంటాయి. నేను దాడి చేస్తాను, దానికి మీరు ప్రతిదాడి చేస్తారు, తర్వాత నేను ప్రతీకారానికి దిగుతాను. ఇద్దరం ఏదో ఒక అంశాన్ని పట్టుకుని ఘనంగా ఇంటికి వెళతాం. దీంతో తమ తమ జాతీయ సైన్యాలను ప్రేమిస్తూనే, పెద్దగా విశ్వసించని ఇరుదేశాల ప్రజల ముందూ విజయాన్ని ప్రకటించుకుని మురిసిపోతాం. అందుకే యుద్ధం అంటే ఏమిటో ప్రభుత్వం తన ప్రజలకు అర్థం చేయిం చగలగాలి. గగనయుద్ధంలో పూర్తి నియంత్రణ సాధించే అమెరికన్‌ యుద్ధ, డ్రోన్‌ దాడుల వీడియో దృశ్యాలు చూసి మనలో చాలా మందిమి మతిపోగొట్టుకున్నాం. లేక ఉడీ సినిమాల్లో చూపించేటటువంటి మూర్ఖపు యుద్ధ సన్నివేశాలను బాగా తలకెక్కించుకున్నాం. కానీ వాస్తవంగా జరిగే యుద్ధం చిన్నపిల్లల టాయ్‌ షాపులోకి అడుగెట్టడమంత సులభం కాదు.

మన సైనికులు సన్నీ డయోల్‌ లేక విక్కీ కౌశల్‌ వంటి అసమానధీరులు కావచ్చు కానీ అదే సమయంలో పాకిస్తానీ సైనికులు జానీ వాకర్‌ తరహా వంటివారు కాదు. వారు కూడా యుద్ధంలో భీకరంగా పోరాడే తత్వం కలవారే. వారు కూడా తమ మాతృభూమి పుత్రులే. భారత వృత్తిగత సైనికులు పాక్‌ సైనికులను తేలిగ్గా చూడటం లేదు. అందుకే వారు నిజమైన యుద్ధాల్లో గెలుస్తున్నారు. కానీ ప్రజల మనస్సుల్లో ఈ వాస్తవ చిత్రణను చొప్పించాల్సిన బాధ్యత మన నేతలపైనే ఉంది. కాని తమ యుద్ధోన్మాద రాజకీయాలకు సైనిక బలగాలను బలి తీసుకోవడం ఏమంత తెలివైన పని కాదు. చివరగా యుద్ధం కంటే యుద్ధాన్ని నివారించే, నిరోధించే తరహా వ్యూహం ఉన్నతమైనది. మన వ్యూహం పాకిస్తాన్‌ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. కాకుంటే ఇరుదేశాలూ సరికొత్త ఉప–అణు నిరోధకతకు సన్నద్ధం కావాలి. నీవు నిరంతర ఘర్షణాత్మక యుద్ధంలో ఓడిపోతావని భారత్‌ పాకిస్తాన్‌కు చెప్పగలగాలి. సైనిక ఘర్షణల్లో నీవు గెలవవచ్చు కానీ ఆర్థికంగా నీకే ఎక్కువ నష్టం సంభవిస్తుందని పాక్‌ కూడా భారత్‌కు చెప్పగలగాలి. 

కాబట్టి ఇరుదేశాలకు ఒకే దారి ఉంది. మొత్తం జీడీపీలో రక్షణ బడ్జెట్‌ని 2 శాతానికే పరిమితం చేయాలి. అంటే ప్రస్తుతం ఇరుదేశాలు వెచ్చిస్తున్న రక్షణ రంగ బడ్జెట్‌లో ఇది 25 శాతం మాత్రమే. అలాగే సైనిక బలగాలను సంస్కరించాలి. సాంప్రదాయికమైన, నిర్ణయాత్మకమైన దండనా చర్యలకు వారిని సన్నద్ధం చేయాలి. ఐఎంఎఫ్‌ నుంచి తీసుకున్న 12 బిలియన్‌ డాలర్ల రుణ భారం వారిని తిరిగి ఆలోచింపజేస్తుంది. ప్రపంచంలోనే ఉత్తమమైన సైన్యాలు ఒకప్పుడు అతిశక్తివంతంగానూ, ఆధిపత్యంతోనూ ఉండేవే. వాటిని మనం ఇంతవరకు ఉపయోగించుకోలేదు. భారత్‌ అలాంటి ఉత్తమ సైన్యాల్లో ఒకటి కావచ్చు కూడా.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు