ఐవీఆర్‌సీఎల్... బ్యాంకుల చేతికే

2 Dec, 2015 02:38 IST|Sakshi
ఐవీఆర్‌సీఎల్... బ్యాంకుల చేతికే

ఎస్‌డీఆర్ అమలును ప్రకటించిన జేఎల్‌ఎఫ్
 రిఫరెన్స్ డే నవంబర్ 26
 త్వరలో కార్యాచరణ ప్రణాళిక
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 
నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్‌సీఎల్... ప్రస్తుత యాజమాన్యం చేతుల్లోంచి జారిపోతోంది. భారీగా అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలో యాజమాన్య హక్కుల్ని తీసుకోవాలని రుణాలిచ్చిన బ్యాంకులు నిర్ణయించటంతో ఇప్పటిదాకా ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. ఐవీఆర్‌సీఎల్‌లో వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణను (ఎస్‌డీఆర్) అమలు చేస్తున్నట్లు జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్‌ఎఫ్) ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 26న జరిగిన సమావేశంలో జేఎల్‌ఎఫ్ నిర్ణయం తీసుకుందని... ఐవీఆర్‌సీఎల్ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఎస్‌డీఆర్ అమలుకు నవంబర్ 26వ తేదీనే రిఫరెన్స్ తేదీగా కూడా నిర్ణయించారు. రుణాల ఊబిలో కూరుకుపోయిన కంపెనీలు కోలుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ నిర్వహణలో విఫలమైతే ఎస్‌డీఆర్ పథకం కింద ఆ కంపెనీలో యాజమాన్య (మెజారిటీ) హక్కులను పొందడానికి రుణాలిచ్చిన సంస్థలకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు గతంలోనే ఆర్‌బీఐ అనుమతులిచ్చింది.
 
 ఎసీడీఆర్ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి బ్యాంకులకు 18 నెలల కాలపరిమితి కూడా ఉంటుంది. ఇందులో భాగంగా తొలుత రుణాలిచ్చిన సంస్థలు ఒక జేఎల్‌ఎఫ్‌గా ఏర్పడి కంపెనీలో మెజారిటీ వాటా 51 శాతం, అంత కంటే ఎక్కువ వాటాను తీసుకోవచ్చు. లేదా ఇచ్చిన అప్పును పూర్తి ఈక్విటీగా మార్చుకోవచ్చు. ఇలా అప్పును ఈక్విటీగా మార్చుకోవాలంటే మొత్తం రుణ విలువలో  75 శాతం రుణం ఇచ్చిన సంస్థలు... లేదా అప్పులిచ్చిన సంస్థల్లో 60 శాతం  ఆమోదించాల్సి ఉంటుంది.
 
 నేడో రేపో కార్యాచరణ ప్రణాళిక...
 ఐవీఆర్‌సీఎల్ విషయానికి వస్తే బ్యాంకులు మెజారిటీ వాటాను తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ముంబైలో ఎస్‌బీఐ నేతృత్వంలో జరిగే సీనియర్ లెండర్స్ సమావేశంలో ‘కరెక్టివ్ యాక్షన్ ప్లాన్’ తయారు చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం బ్యాంకుల వద్ద 48% వాటా ఉండటంతో 51% వాటాను తీసుకోవడం ద్వారా కంపెనీ నిర్వహణ బాధ్యతలను చేపట్టాలన్నది బ్యాంకర్ల నిర్ణయంగా తెలుస్తోంది.
 
  ప్రస్తుతం ఐవీఆర్‌సీఎల్ బోర్డులో బ్యాంకుల నుంచి ఇద్దరు ప్రతినిధులున్నారు. కంపెనీ గాడిలో పడిన తర్వాత కొత్త వారికి వాటాలను విక్రయించడమా? లేక ఈ రంగంలోని నిపుణులతో బ్యాంకులే కంపెనీని నిర్వహించడమా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఎస్‌డీఆర్ అమల్లోకి వస్తే ప్రస్తుతం కంపెనీలో 8.28% వాటా కలిగి ఉన్న ప్రస్తుత ప్రమోటర్లకు కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి సంబంధాలు ఉండవు. కేవలం ఇన్వెస్టర్లుగానే కొనసాగుతారు.
 
 మా దృష్టికి రాలేదు
 కాగా కంపెనీని కాపాడుకోవటానికి దీన్ని రెండుగా విడదీయాలని ప్రమోటర్లు ప్రతిపాదిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఒకటిరెండు బ్యాంకుల ఉన్నతాధికారులను ‘సాక్షి’ సంప్రదించింది. అయితే ఈ ప్రతిపాదన జేఎల్‌ఎఫ్ వద్దకు రాలేదని, ఈ వార్తలు కేవలం పేపర్లలోనే చూశామని వారు చెప్పారు. ‘‘అధికారికంగా మాకు ఇలాంటి ప్రతిపాదనలేమీ రాలేదు.
 ఒకవేళ ఈ ప్రతిపాదనతో కంపెనీకి మేలు జరుగుతుందంటే జేఎల్‌ఎఫ్ ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తుంది’’ అని ఓ బ్యాంకు ఉన్నతాధికారి తెలియజేశారు. అప్పులు అధికంగా ఉన్న అసెట్ హోల్డింగ్‌ను విడదీయడం ద్వారా ప్రధాన ఆదాయ వనరైన ఈపీసీ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించడం ద్వారా అప్పులు తగ్గించుకోవాలన్నది ప్రస్తుత ప్రమోటర్ల ఆలోచన. ఈ ప్రతిపాదనను బ్యాంకర్లు ఆమోదిస్తారా లేదా అన్నది వచ్చే రెండు రోజుల్లో తెలుస్తుంది. తాజా వార్తలతో ఒక దశలో 12% పెరిగిన ఐవీఆర్‌సీఎల్ షేరు లాభాల స్వీకరణతో చివరకు 2.3% పెరిగి రూ. 10.95 వద్ద ముగిసింది. గత 2 రోజుల్లో ఐవీఆర్‌సీఎల్ 33% పెరగ్గా, నెలన్నరలో సుమారు 100% పెరిగింది.
 

మరిన్ని వార్తలు