పెరగనున్న సిమెంట్‌ డిమాండ్‌!

28 Feb, 2018 00:45 IST|Sakshi

2018–19లో 4.5% వృద్ధి: ఇక్రా

న్యూఢిల్లీ: భారత్‌లో సిమెంట్‌ డిమాండ్‌కు సంబంధించిన వృద్ధి  2018–19లో 4.5 శాతంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా మంగళవారం వెలువరించిన తన నివేదికలో పేర్కొంది. గృహ నిర్మాణ రంగం పుంజుకోవడం, మౌలిక రంగంలో పెట్టుబడుల వృద్ధి దీనికి కారణంగా అంచనావేసింది. ‘‘2017–18 ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య దేశీయ సిమెంట్‌ ఉత్పత్తి 216.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు (ఎంఎంటీ), 2016–17 ఇదే కాలంతో పోల్చిచూస్తే (210.8 ఎంఎంటీ) ఇది 2.7 శాతం అధికం.

ప్రస్తుత ధోరణి చూస్తుంటే, నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నెలవారీగా చూస్తే, 2017 డిసెంబర్‌లో సిమెంట్‌ ఉత్పత్తి వృద్ధి 8.4 శాతం పెరిగి 26.3 ఎంఎంటీలుగా నమోదయ్యింది’’ అని ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, గ్రూప్‌ హెడ్‌ సవ్యసాచి మజుందార్‌ తాజా నివేదికలో వివరించారు. గ్రామీణ ఆదాయాల్లో మెరుగుదల, రుణ వృద్ధి పెరగడం,   గ్రామీణ గృహ నిర్మాణ రంగంలో డిమాండ్‌ పెరుగుదలకు దోహదపడతాయని ఆయన విశ్లేషించారు.

అక్టోబర్‌ నుంచీ పుంజుకుంది.
ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో ఉత్పత్తి తగ్గడాన్ని కూడా నివేదికలో ఇక్రా ప్రస్తావించింది. ఇసుక కొరత, రియల్టీ రెగ్యులేటరీ అథారిటీ (ఆర్‌ఈఆర్‌ఏ) అమలు, కరువు వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇక రెండవ త్రైమాసికంలో జీఎస్‌టీ సంబంధిత అంశాలు, సగటుకన్నా తక్కువ వర్షపాతం, ఇసుక లభ్యతలో ఇబ్బందులు కొనసాగడం వంటి అంశాలు ఉత్పత్తి తగ్గడానికి కారణాలని పేర్కొంది.

అయితే డిసెంబర్‌ త్రైమాసికంలో(అక్టోబర్‌–డిసెంబర్‌) ఉత్పత్తి 11.6 శాతం పెరిగి 75.6 ఎంఎంటీకి చేరిందని ఇక్రా పేర్కొంది.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తూర్పు రాష్ట్రాలు (బిహార్‌ మినహా), పశ్చిమ మార్కెట్లు మెరుగుపడటం ఉత్పత్తి పెరగడానికి కారణాలుగా వివరించింది.  

>
మరిన్ని వార్తలు