సిమెంట్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి..

13 Aug, 2014 02:09 IST|Sakshi
సిమెంట్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి..

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘నాలుగేళ్ల క్రితం సిమెంట్‌కు మంచి డిమాండ్ ఉంటుందని భావించి మా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని  30 నుండి 40 శాతానికి పెంచాం. అంచనాలకు మించి డిమాండ్ ఉంటుందని భావించాం. అయితే నాలుగేళ్ల తర్వాత పరిస్థితిలో మేం ఆశించిన పురోగతి లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలగా విడిపోవడంతో ఆశించిన కొత్త ప్రాజెక్టులు రాలేదు. నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. మరికొన్ని ఉత్పత్తిని తగ్గించాయి.

దీంతో సిమెంట్ పరిశ్రమ మొత్తం ఒక సంక్షోభ వాతావరణంలో చిక్కుకుంది. ప్రభుత్వ సహకారం, సానుకూల వాతావరణం నెలకొంటే పరిశ్రమ మళ్లీ అభివృద్ధి బాట పడుతుంది’’ అని సాగర్ సిమెంట్స్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్ . ఆనంద్ రెడ్డి చెప్పారు. ఇటీవల భవన నిర్మాణ సంఘాలకు, సిమెంట్ ఉత్పత్తి దారులకు మధ్య నెలకొన్న వివాదం సమసిపోయినా, సిమంట్ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపధ్యంలో   సాక్షి ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సవాళ్లను వివరించారు.

 సిమెంట్ బస్తా ధర బాగా పెరిగిపోతోంది. మీ కామెంట్?
 ధరలను పెంచటం ద్వారా ఉత్పత్తి దారులు లాభాలను మూటగట్టుకోవడం లేదు. మేం కేవలం నష్టాలను తగ్గించుకుంటున్నాం. సిమెంట్ తయారీలో స్థిర వ్యయాలు, చలన వ్యయాలు అని రెండు రకాలు. స్థిర వ్యయాలను అదుపు చేయలేం. అవి  ఏ సంస్థ అయినా తప్పక భరించాలి. ఇక చలన వ్యయాల్లో ఏవీ మా చేతుల్లో లేవు. ఉదాహరణకు విద్యుత్, బొగ్గు, డీజల్, రవాణా చార్జీలు...ఇవన్నీ గత ఏడాది కాలంగా బాగా పెరిగాయి. డీజల్ ధర నెలనెలకూ పెరుగుతూనే ఉంది.

ఒక టన్ను సిమెంట్ ఉత్పత్తి చేయాలంటే తయారీదారు రూ. 3,655 వెచ్చించాల్సి వస్తోంది. దీనికి అదనంగా రవాణా, ఎక్సైజ్ డ్యూటీ, విలువ ఆధార పన్నులు రూ. 3,050లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. దీంతో టన్ను సిమెంట్ ఉత్పత్తి చేయాలంటే రూ. 6,705లు వ్యయం అవుతోంది. అంటే సగటున 50 కిలోల బస్తా వెల రూ. 335 అవుతోంది. ఇది కేవలం లాభనష్టాల్లేని బ్రేక్ ఈవెన్ ధర.  పూర్తిగా యంత్ర ఆధారిత పరిశ్రమ కావడంతో సామర్థ్య వినియోగం అభిలషణీయ స్థాయిలో లేకపోతే తరుగుదల, వడ్డీ, అడ్మినిస్ట్రేటివ్, మార్కెటింగ్ వ్యయాలు పరిమిత ఉత్పత్తిపై  మరింత భారం మోపుతున్నాయి. రవాణా, ఇంధన వ్యయాలు గత రెండేళ్లలోనే 60-70 శాతం పెరిగాయి. ఒక్కో బస్తాపై  ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీ  రూ. 40, విలువ ఆధారిత పన్ను రూ. 45 ఆదాయం అందుతోంది. ఇది బస్తా వ్యయంలో 28 శాతానికి సమానం.

 భవిష్యత్తులో ధరలు తగ్గే అవకాశం లేదా?
 సిమెంట్ ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవూ. ఏడాది పొడవునా సీజన్‌ను బట్టి  ధరల్లో హెచ్చు తగ్గులు ఈ పరిశ్రమలో సర్వ సాధారణం. ఇప్పుడు ధరలు ఎందుకు పెంచామంటే కేవలం నష్టాలను పూడ్చుకోవాటానికి మాత్రమే అని నేను చెప్పగలను. ఈ ధరలు సప్లయ్-డిమాండ్ ఆధారంగా నిర్ణయింపబడతాయి కాబట్టి భవిష్యత్తులో సప్లయ్ అధికమైతే ధరలు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు.

 పరిశ్రమ ప్రభుత్వం నుండి ఏం కోరుతోంది?
 తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు మేం చేసే విన్నపం ఒక్కటే... పరిశ్రమలకు విద్యుత్ నిరంతరాయంగా అందించండి.విద్యుత్‌తో పాటు డీజల్ ధరలను, బొగ్గుధరలను అదుపులో ఉంచండి. ప్రభుత్వానికి పన్నుల రూపేణ అధిక మొత్తాన్ని అందచేస్తున్న పరిశ్రమల్లో సిమెంట్ పరిశ్రమ ఒకటి. ఒక్కో కంపెనీ కనీసం 4 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వం చేపట్టే బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి అవసమరమైన సిమెంట్‌ను తక్కువ ధరలకే అందిస్తోంది.

 ప్రస్తుత పరిస్థితుల్లో సిమెంట్ యూనిట్ గిట్టుబాటుగా ఉందా?
 సిమెంట్ యూనిట్ మనగలగాలి అంటే ఉత్పత్తి సామర్ధ్యంలో కనీసం 75 శాతం స్థాయిని అందుకోవాలి. ఉత్తర భారతదేశంలో సిమెంట్ యూనిట్లు ఉత్పత్తి సామర్ధ్యంలో 80-90 శాతం స్థాయిని వినియోగిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో ఈ స్థాయి 50-60 శాతం మధ్యనే ఉంటోంది. ద క్షిణ భారత దేశంలో ఇతర రాష్ట్రాలకు సిమెంట్‌ను సరఫరా చేస్తోంది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని యూనిట్లే. సో... యూనిట్ వయబుల్ కావాలంటే బస్తా ధర రూ. 330లుపైబడి నిర్ణయించాలి.

 విలీనాలు, కొనుగోళ్లు?
 కొత్త యూనిట్ పెట్టాలంటే కనీసం మూడున్నరేళ్లు సమయం కావాలి. దీంతో చాలా మంది రన్నింగ్‌లో ఉన్న యూనిట్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ రంగంలో కన్సాలిడేషన్ జరుగుతోంది. మైహోం సిమెంట్ సంస్థ జయజ్యోతి సిమెంట్‌ను కొనుగోలు చేసిన విషయం చూశాం. అలాగే చెట్టినాడు సిమెంట్ అంజనీ సిమెంట్‌ను కొనుగోలు చేసింది.  కొంత మంది తమ యూనిట్లను బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు. కాబట్టి రోబోయే రోజుల్లో కొన్ని సంస్థల మధ్య విలీనాలు, కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. కొన్ని బహుళ జాతి సంస్థలు కూడా ఈ రేసులో ఉన్నాయి. ఆయితే వారంతా టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

 తెలంగాణలోనే సిమెంట్ చౌక...
 ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ తయారీ ధర కన్నా  చౌక ధరకే లభిస్తోంది. సిమెంట్ బస్తా విక్రయ ధర తెలంగాణలో రూ. 300 ఉండగా ఆంధ్రప్రదేశ్ (వైజాగ్)లో రూ. 325, తమిళనాడు (చెన్నై)లో రూ. 365, కర్నాటక(బెంగుళూరు)లో రూ 374, మహారాష్ట్ర (పుణె)లో రూ. 375, ఒరిస్సా (భువనేశ్వర్)లో రూ. 340, కేరళ (కొచ్చి)లో రూ. 394 ధర పలుకుతోంది.

మరిన్ని వార్తలు