భారతీయులకూ...బిట్‌ కాయిన్‌ మోజు!

18 May, 2017 01:33 IST|Sakshi
భారతీయులకూ...బిట్‌ కాయిన్‌ మోజు!

ముంబై: బిట్‌ కాయిన్‌ తరహా వర్చువల్‌ కరెన్సీ (కేవలం డిజిటల్‌ రూపంలోనే ఉండేవి)లకు ఎటువంటి గుర్తింపు లేదని, వాటిని కొనుగోలు చేసి నష్టపోవద్దని ఆర్‌బీఐ దేశ ప్రజలను హెచ్చరిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. దేశీయ యాప్‌ ఆధారిత బిట్‌ కాయిన్‌ ఎక్సే్చంజ్‌ ‘జెబ్‌పే’ను ఇప్పటి వరకు ఐదు లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, రోజూ 2,500 మందికి పైగా కొత్త యూజర్లు జతవుతున్నారని ఈ సంస్థ పేర్కొంది. బిట్‌ కాయిన్‌ను అత్యంత ప్రాచుర్యం పొందిన అస్సెట్‌ క్లాస్‌గా ఆమోదించడం పెరుగుతోందని తెలిపింది.

నూతన ఆర్థిక విప్లవం అంచున దేశం ఉందని ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు సందీప్‌ గోయెంకా పేర్కొనడం గమనార్హం. కస్టమర్లు సంప్రదాయేతర పెట్టుబడుల దిశగా అడుగు వేస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 10 లక్షల డౌన్‌లోడ్ల లక్ష్యాన్ని విధించకున్నట్టు చెప్పారు. బిట్‌ కాయిన్‌లో ట్రేడింగ్‌కు వీలుగా 2015లో కార్యకలాపాలు ప్రారంభించింన జెబ్‌పే గత జనవరిలో 10 లక్షల అమెరికన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. వర్చువల్‌ కరెన్సీలతో లావాదేవీలు నిర్వహించేవారు సొంతంగా రిస్క్‌ భరిస్తున్నట్టు గుర్తించాలని ఆర్‌బీఐ లోగడే హెచ్చరించింది. బిట్‌కాయిన్‌ తరహా కరెన్సీలతో ఆర్థిక, న్యాయ, వినియోగదారు రక్షణ, భద్రతా సంబంధ సవాళ్లు నెలకొన్నాయనేది ఆర్‌బీఐ ఆందోళన.

మరిన్ని వార్తలు