డేటా లీక్‌ : 130 బిలియన్‌ డాలర్లు మటాష్‌!

26 Jul, 2018 10:00 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా ద్వారా అధిక సంఖ్యలో వినియోగదారుల డేటా చోరీ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఆదాయం భారీగా క్షీణించనుందన్న అంచనాలతో  మార్కెట్‌లో  ఫేస్‌బుక్‌  కౌంటర్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. వినియోగదారుల వృద్ధి, రెవెన్యూ భారీగా పడిపోవడంతో మార్కెట్‌ ఆరంభంలోనే సంస్థ షేర్‌ కుప్ప కూలింది. వాడుకదారుల వృద్ధిలో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా నమోదు చేసింది. దీంతో తీవ్ర అమ్మకాలతో ఒత్తిడితో 24 శాతానికిపైగా నష్టపోయింది. కేవలం రెండే రెండు గంటల్లో మార్కెట్ విలువలో 130 బిలియన్ డాలర్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. 2012తరువాత ఇదే అదిపెద్ద పతనమని ఎనలిస్టులు చెబుతున్నారు. అటు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ 16.8 బిలియన్‌ డాలర్ల మేర వ్యక్తిగత సంపదను కోల్పోయారు. కంపెనీ ఆదాయ అంచనాల ప్రకటన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

ప్రధాన ఆర్థిక అధికారి డేవిడ్ వేహ్నెర్ రాబోయే త్రైమాసికంలో బలహీనమైన  ఆదాయం అంచనాలను వెల్లడించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. రెవెన్యూ వృద్ధి రెండవ త్రైమాసికంలో "క్షీణించింది" ఇది మరింత తగ్గిపోనుందని డేవిడ్‌ ప్రకటించారు. ఈ క్షీణత రాబోయే సంవత్సరాల్లో  కొనసాగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రెండవ త్రైమాసికంలో లాభాలు 31 శాతం పెరిగి 5.1 బిలియన్‌ డాలర్లగా నమోదు కాగా, ఆదాయాలు 42 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఫేస్‌బుక్‌ నెలవారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య కేవలం 11శాతం పుంజుకుని 2.23 మిలియన్లుగా నమోదైంది. 2.25మిలియన్లుగా నమెదుకావచ్చని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే రోజువారీ యూజర్ల సంఖ్య ఎనలిస్టులు అంచనాలను మిస్‌ చేసి 11శాతం వృద్ధితో 1.47మిలియన్లుగా నమోదైంది.

భద్రత, గోప్యత అంశాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నామని ఫేస్‌బుక్‌ అధిపతి జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. సంస్థను తరువాతి త్రైమాసికం కోసం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా నడపనున్నామంటూ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందించే వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు