హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌ ఉచితం

7 Nov, 2017 00:13 IST|Sakshi

చెక్కు లావాదేవీలు భారం

న్యూఢిల్లీ: డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహమిచ్చే దిశగా ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌ రూపంలోని ఆన్‌లైన్‌ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసింది. నవంబర్‌ 1 నుంచి ఈ సర్వీసులను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది.

అయితే, చెక్కు సంబంధ లావాదేవీలు మాత్రం భారం కానున్నాయి. సేవింగ్స్, శాలరీ అకౌంట్స్‌కి సంబంధించి సవరించిన చార్జీల ప్రకారం నవంబర్‌ 1 నుంచి రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌), నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) ద్వారా చేసే ఆన్‌లైన్‌ లావాదేవీలు ఉచితంగా ఉంటాయి.

అయితే, బ్యాంకు శాఖలో గానీ ఈ లావాదేవీ నిర్వహిస్తే చార్జీలు వర్తిస్తాయి. రూ. 2–5 లక్షల ఆర్టీజీఎస్‌ లావాదేవీకి రూ.25 చొప్పున, రూ. 5 లక్షలు దాటితే రూ. 50 మేర చార్జీలు ఉన్నాయి. అదే రూ.10,000 లోపు నెఫ్ట్‌ లావాదేవీకి రూ. 2.5, రూ. 10,001 నుంచి రూ. 1,00,000 దాకా రూ. 5, అంతకు మించి రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల దాకా రూ. 15 చార్జీలు రూ. 2 లక్షలు పైబడితే రూ. 25 చార్జీ ఉన్నాయి.

చెక్కు బుక్‌పై పరిమితులు..
ఇకపై ఏడాదికి 25 చెక్కులు ఉండే ఒక్క చెక్‌బుక్‌ మాత్రమే ఉచితంగా ఉంటుంది. చార్జీ మాత్రం యధాతథంగా రూ.75గానే ఉంటుంది. ఇప్పటిదాకా ఇలాంటి చెక్‌బుక్కులు ఏడాదికి రెండు ఇచ్చేవారు. ఒకవేళ ఖాతాలో తగినన్ని నిధులు లేక చెక్‌ గానీ రిటర్న్‌ అయితే రూ. 500 మేర పెనాల్టీ విధిస్తారు. ఇప్పటిదాకా ఒక త్రైమాసికంలో ఒక చెక్‌ రిటర్న్‌ అయితే రూ. 350, ఆ తర్వాత నుంచి రూ. 750 మేర పెనాల్టీ ఉండేది. తాజా మార్పులు డిసెంబర్‌ 1 నుంచి  వర్తిస్తాయని బ్యాంకు పేర్కొంది.

మరిన్ని వార్తలు