మ్యూచువల్‌ ఫండ్‌లో డివిడెండ్‌ ఖరారు ఎలా...?

10 Apr, 2017 12:29 IST|Sakshi
మ్యూచువల్‌ ఫండ్‌లో డివిడెండ్‌ ఖరారు ఎలా...?

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల వృద్ధికి మాత్రమే కాదు, అడపా దడపా అవసరాలకు మధ్యంతరంగా నగదు అందుకునేందుకూ అక్కరకు వస్తాయి. అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో డివిడెండ్, గ్రోత్‌ ఆప్షన్లు ఉంటాయనే విషయం తెలిసిందే. డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే  మధ్య మధ్యలో డివిడెండ్‌ రూపంలో ఆదాయం పొందవచ్చు. మరి ఈ డివిడెండ్‌ ఖరారు ఎలా చేస్తారంటే...

ఓ మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో పెట్టుబడులను విక్రయించగా వచ్చిన లాభం నుంచే డివిడెండ్‌ పంపిణీ ఉంటుంది. ఫండ్‌ మేనేజర్‌  లాభాలను నమోదు చేసినా, కంపెనీల నుంచి డివిడెండ్‌ రూపంలో ఆదాయం అందుకున్నా... ఒకవేళ డెట్‌ ఫండ్స్‌ అయితే వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం నుంచి ఈ డివిడెండ్‌ పంపిణీ ఉంటుంది.  

డివిడెండ్‌ ఎప్పుడెప్పుడు..?
నెలకోసారి, త్రైమాసికంలో ఓ సారి లేదా వార్షికంగా ఒక సారి డివిడెండ్‌ను ప్రకటించే పథకాలు ఉంటాయి. మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్లు, హైబ్రిడ్‌ ఫండ్స్‌లో చాలా వరకు క్రమం తప్పకుండా నెలనెలా డివిడెండ్‌ను జారీ చేస్తుంటాయి. ఎంత మొత్తం అంటే... నిర్దిష్టంగా ఇంత అని చెప్పడానికి ఉండదు. ముఖ్యంగా డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంచుకున్న మ్యూచువల్‌ఫండ్‌ పథకంలో యూనిట్‌ ఎన్‌ఏవీ... గ్రోత్‌ ఆప్షన్‌ యూనిట్‌ ఎన్‌ఏవీతో పోల్చి చూస్తే వృద్ధి చెందదు. ఎన్‌ఏవీ కొంచెం పెరిగిన వెంటనే ఆ మేరకు ఫండ్‌ మేనేజర్‌ డివిడెండ్‌ను పంపిణీ చేసేస్తుంటారు. ఉదాహరణకు ఓ ఫండ్‌ యూనిట్‌ రూ.10కి కొనుగోలు చేశారు. ఓ నెల తర్వాత అది రూ.12 అయిందనుకోండి. రూ.2ను డివిడెండ్‌గా ప్రకటించవచ్చు.

పన్ను ఉంటుందా...?
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ జారీ చేసే డివిడెండ్‌ ఆదాయంపై పన్ను ఉండదు. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ అయితే మాత్రం ఫండ్‌ నిర్వహణ సంస్థ 28.84 శాతాన్ని డివిడెండ్‌ పంపిణీ పన్నుగా చెల్లిస్తుంది.

డివిడెండ్‌ ఆప్షన్‌ సరైనదేనా...?
రిస్క్‌ తీసుకునేందుకు ఇష్టపడని ఇన్వెస్టర్లకు డివిడెండ్‌ ఆప్షనే సరైనది. అలాగే క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి కూడా ఇదే తగినది. దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవాలని కోరుకునే వారు మాత్రం గ్రోత్‌ ఆప్షన్‌ ఎంచుకుని సిప్‌ విధానంలో పెట్టుబడి పెడుతూ వెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తుంటారు. డివిడెండ్‌ విధానంలో కాంపౌండింగ్‌ వడ్డీ ప్రయోజనం కోల్పోవడం వల్ల సంపద వృద్ధి సాధ్యం కాదు.

మరిన్ని వార్తలు