కరోనా పరిణామాలే కీలకం..!

23 Mar, 2020 06:14 IST|Sakshi

గురువారం ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌ ముగింపు

భారీ ఒడిదుడుకులకు ఆస్కారం: మోతీలాల్‌ ఓస్వాల్‌

వైరస్‌ పరిణామాలతోనే ఈ వారం సూచీలకు దిశా నిర్దేశం

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ ధాటికి ప్రపంచం దాదాపుగా స్తంభించిపోయింది. దేశాలకు దేశాలు షట్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిపోయింది. వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గకపోతే ఎకానమీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం కరోనా వైరస్‌ పరిణామాలు మాత్రమే ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

వైరస్‌ విస్తృతి ఆధారంగానే ఈ వారంలో సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు చందన్‌ తపారియా అన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వోలటాలిటీ ఇండెక్స్‌ (ఇండియా వీఐఎక్స్‌) జీవితకాల గరిష్టస్థాయికి చేరినందున భారీ హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని విశ్లేషించారు. వైరస్‌ ఇబ్బందుల దృష్ట్యా వీలైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇవ్వడం వంటి ఆశాజనక వార్తలు రిలీఫ్‌ ర్యాలీకి ఆస్కారం ఇచ్చినప్పటికీ.. వైరస్‌ వ్యాప్తి అంశమే అత్యంత కీలకంకానుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.  

మార్చి సిరీస్‌ ముగింపు ఈవారంలోనే..
గురువారం (26న) మార్చి నెల ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌ అండ్‌ ఓ) సిరీస్‌ ముగియనుంది. ఈ సిరీస్‌లో సూచీలు 35 శాతం నష్టపోయాయి. వోలటాలిటీ 72 శాతానికి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో షార్ట్‌ రోలోవర్స్‌ కొనసాగుతున్నాయని, నిఫ్టీ 7,800–8,000 పాయింట్ల స్థాయికి పడిపోతే ట్రేడర్లు పొజిషన్లను క్లోజ్‌ చేసే అవకాశం ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అనలిస్ట్‌ అమిత్‌ గుప్తా విశ్లేషించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు పెరిగితే సూచీలు కుప్పకూలి పోతాయని చెప్పడంలో సందేహం లేదని ట్రేడింగ్‌బెల్స్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సంతోష్‌ మీనా వ్యాఖ్యానించారు. మరణాలు ఆగితేనే మార్కెట్‌ నిలబడుతుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. షార్ట్‌ సెల్లింగ్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిమితులను విధించిన నేపథ్యంలో ఎఫ్‌ అండ్‌ ఓలోని 10–12 శాతం షేర్లపై ఈ ప్రభావం ఉందనుందని సామ్కో సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ జిమీత్‌ మోడీ అన్నారు.

ఎక్సే్ఛంజీలు పనిచేస్తాయ్‌..
దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలు సోమవారం యథావిధిగా పనిచేస్తాయని సెబీ ప్రకటించింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై షట్‌డౌన్‌లో ఉన్నప్పటికీ.. స్టాక్‌ ఎక్సే్ఛంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు, డిపాజిటరీలు మాత్రం పనిచేస్తాయని స్పష్టంచేసింది. బోంబే స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లోని అన్ని విభాగాలు సోమవారం యథావిధిగా పనిచేస్తాయని బీఎస్‌ఈ మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ ప్రకటించారు. నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ కూడా ఇదే ప్రకటన చేసింది.

స్టాక్‌ బ్రోకర్లకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌలభ్యం
కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా భారత్‌లో మృతిచెందిన వారి సంఖ్య ఇప్పటికే ఏడుకు చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో స్టాక్‌ బ్రోకర్లకు ఇంటి వద్ద నుంచి పని చేసే సౌలభ్యం కల్పించినట్లు దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి. ఈనెల 30 వరకు ఈ ఫెసిలిటీని ఇస్తున్నట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు స్పష్టంచేశాయి. ఈ క్రమంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా బ్రోకర్ల వద్ద నుంచి వారి టెర్మినల్‌ లొకేషన్ల అడ్రస్‌లను సేకరిస్తున్నట్లు వివరించాయి.

ఈ నెలలో రూ. లక్ష కోట్లు వెనక్కి..
భారత క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో రూ. 1,08,697 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. మార్చి 2–20 మధ్యలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ. 56,248 కోట్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ. 52,449 కోట్లను వెనక్కు తీసుకున్నారు. కరోనా వైరస్‌ కారణం గా దేశీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ సీనియర్‌ అనలిస్ట్‌ హిమాన్షు శ్రీవాస్తవ విశ్లేషించారు.

మరిన్ని వార్తలు