అంచనాలను తప్పిన టెక్‌ దిగ్గజం

13 Jul, 2018 16:43 IST|Sakshi
ఇన్ఫోసిస్‌ క్యూ1 ఫలితాలు

ముంబై : దేశీయ రెండో అతిపెద్ద టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అంచనాలను తప్పింది. కంపెనీ నేడు ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో కేవలం రూ.3,612 కోట్ల నికర లాభాలను మాత్రమే ఆర్జించింది. గత త్రైమాసికంలో ఇవి రూ.3,690 కోట్లగా ఉన్నాయి. విశ్లేషకులు అంచనాల ప్రకారం ఇన్ఫోసిస్‌ రూ.3,731.80 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని భావించారు. కానీ వీరి అంచనాలను కూడా ఈ టెక్‌ దిగ్గజం తప్పింది. అయితే ఏడాది ఏడాదికి కంపెనీ లాభాలు 3.7శాతం పెరిగాయి. టీసీఎస్‌ ఫలితాల ప్రకటన అనంతరం ఇన్ఫోసిస్‌ తన ఫలితాలను నేడు విడుదల చేసింది.ఈ క్వార్టర్‌లో కంపెనీ రెవెన్యూలు ఏడాది ఏడాదికి 12 శాతం పెరిగి రూ.19,128 కోట్లగా రికార్డయ్యాయి. మార్చి క్వార్టర్‌లో ఈ రెవెన్యూలు రూ.18,083 కోట్లగా ఉన్నాయి. 

జూన్‌తో ముగిసిన ఈ క్వార్టర్‌లో బేసిక్‌ ఈపీఎస్‌ 16.62 రూపాయలుగా ఉందని ఇన్ఫోసిస్‌ తెలిపింది.  స్థిరమైన కరెన్సీ విలువల్లో 2019 ఆర్థిక సంవత్సరపు రెవెన్యూ గైడెన్స్‌ 6 శాతం నుంచి 8 శాతం మధ్యలోనే ఉంచింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ గైడెన్స్‌ను కూడా 22 శాతం నుంచి 24 శాతంగానే నిర్ణయించింది. మొత్తం రెవెన్యూల్లో డిజిటల్‌ రెవెన్యూలు 28.4 శాతంగా 803 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ తన ఫలితాల్లో వెల్లడించింది. ప్రస్తుతం పనాయా కోసం జరుగుతున్న చర్చలు తమ లాభాలపై ప్రభావం చూపాయని ఇన్ఫోసిస్‌ చెప్పింది. గత క్వార్టర్‌లో ఈ ఇజ్రాయెల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని చెందిన పలు ఆస్తులను కంపెనీ అమ్మకానికి ఉంచింది. అమ్మకానికి ఉంచిన ఆ ఆస్తుల ఫెయిర్‌ వాల్యును కంపెనీ తగ్గించడంతో, ఈ ప్రభావం నికర లాభాలపై చూపిందని ఇన్ఫోసిస్‌ పేర్కొంది. పనాయాను కొనుగోలు చేసేటప్పుడు కూడా కంపెనీలో పలు పరిణామాలు ఎదరయ్యాయి. ఈ డీల్‌ వ్యవహారం కాస్త రచ్చకే దారితీసింది. 

మరిన్ని వార్తలు