లాభాల స్వీకరణతో పడిపోయిన మార్కెట్‌

1 Jun, 2019 07:29 IST|Sakshi

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు  

గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ

తీవ్ర హెచ్చుతగ్గుల్లో సెన్సెక్స్, నిఫ్టీలు  

ఇంట్రాడేలో 40,000 పైకి సెన్సెక్స్, 12,000 పైకి నిఫ్టీ

ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌మార్కెట్‌ చివరకు నష్టాల్లో ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్లపైకి ఎగబాకాయి.  అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగా ఉండటంతో ఈ లాభాలను కోల్పోయి సెన్సెక్స్,నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. రోజంతా 748 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన  సెన్సెక్స్‌ చివరకు 118 పాయింట్లు పతనమై 39,714 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్లు తగ్గి 11,923 పాయింట్ల వద్ద ముగిశాయి. వాహన, ఆర్థిక, లోహ, ఇంధన రంగ షేర్లు నష్టాలకు గురయ్యాయి. మార్కెట్‌ ముగిసిన తర్వాత జీడీపీ, మౌలిక రంగ, ద్రవ్యలోటు  గణాంకాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 279 పాయింట్లు, నిఫ్టీ 79 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఆరంభం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది.

748 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 290 పాయింట్ల లాభంతో 40,122 పాయింట్లను తాకింది. ఇక నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 12,039 పాయింట్ల వద్దకు చేరింది. మంత్రుల పోర్ట్‌ఫోలియోల వివరాలు వెల్లడి కావడం, కీలక గణాంకాలు మార్కెట్‌ ముగిసిన తర్వాత రానుండటంతో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 458 పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు మేర పతనమయ్యాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్‌ 748 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. చైనా తయారీ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ఆసియా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురై మిశ్రమంగా ముగిశాయి. మెక్సికో దిగుమతులపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి.  

మన్‌పసంద్‌... 5 రోజుల్లో 53 శాతం డౌన్‌
మన్‌పసంద్‌ బేవరేజేస్‌ షేర్‌ ఐదో రోజూ నష్టపోయింది. జీఎస్‌టీ కేసులో కంపెనీ అధికారులు అరెస్ట్‌ కావడంతో ఈ షేర్‌ పతనమవుతోంది. శుక్రవారం ఈ షేర్‌ 10 శాతం నష్టపోయి జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.51.40 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ షేర్‌ 53 శాతం పతనమైంది. మార్కెట్‌ కు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...

యస్‌ బ్యాంక్‌ షేర్‌ 4.2 శాతం నష్టంతో రూ.148 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌  ఇదే.  
4వ త్రైమాసిక కాలానికి అంచనాలను మించిన ఫలితాలను వెల్లడించడంతో బెర్జర్‌ పెయింట్స్‌ (ఇండియా) షేర్‌ 10 శాతం లాభంతో రూ.331 వద్ద ముగిసింది.  
ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 1–2 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.
గత క్యూ4లో నికర లాభం 362 శాతం వృద్ధితో రూ.6,024 కోట్లకు పెరగడంతో కోల్‌ ఇండియా షేర్‌ ఇంట్రాడేలో 4 శాతం ఎగసింది. చివరకు 0.2 శాతం లాభంతో రూ. 253 వద్ద ముగిసింది.  
ఈ ఏడాది ఏప్రిల్‌ 1 తర్వాత జారీ చేసిన అన్ని కాంట్రాక్టులను ఆంధ్రప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రద్దు చేస్తే, తమకు రూ.6,100 కోట్ల నష్టాలు వస్తాయని ఎన్‌సీసీ పేర్కొంది. దీంతో ఈ షేర్‌ 16 శాతం కుదేలై, రూ.98 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా