వారి హయాంలోనే బ్యాంకులు డీలా..

16 Oct, 2019 13:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం విధాన నిర్ణేతలు, నేతల మధ్య పరస్పర విమర్శలకు తావిస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ ఆర్బీఐ సారథి రఘురామ్‌ రాజన్‌ల హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అధ్వానంగా తయారయ్యాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి ప్రాణవాయువు అందించడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఉత్తేజంగా ఉన్న సమయంలో కేంద్ర బ్యాంక్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన రఘురామ్‌ రాజన్‌ను తాను గొప్ప మేథావిగా గౌరవిస్తానని ఆమె పేర్కొన్నారు.

బ్రౌన్‌ వర్సిటీలో రఘురామ్‌ రాజన్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించడాన్ని ప్రస్తావిస్తూ రాజన్‌ హయాంలో జరిగిన బ్యాంక్‌ రుణాల జారీలో సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. రాజన్‌ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో కేవలం ఫోన్‌ కాల్స్‌పై రుణాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం ఆ నష్టాలను పూడ్చుకునేందుకు ప్రభుత్వ ఈక్విటీపై ఆధారపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ హయంలో డాక్టర్‌ సింగ్‌ భారత్‌ పట్ల సరైన విజన్‌తో ఉండాలని డాక్టర్‌ రాజన్‌ కోరుకుని ఉండాలని ఆమె చేసిన వ్యాఖ్యలకు సభలో నవ్వులు పూశాయి. సింగ్‌, రాజన్‌ల హయాంలో భారత బ్యాంకులకు దుర్థశ వాటిల్లిందని ఆమె స్పష్టం చేశారు. ఆ సమయంలో బ్యాంకులకు వాటిల్లే కష్టనష్టాలపై మనకెవరికీ తెలియదని అన్నారు.

మరిన్ని వార్తలు