వెనక్కి తగ్గిన కేంద్రం: రాహుల్‌ ఎఫెక్టేనా?

30 Jan, 2018 20:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాస్‌పోర్టు రంగుమార్పులో కేంద్ర ప్రభుత్వం  వెనక్కి  తగ్గింది. ఆరెంజ్‌ కలర్‌లో పాస్‌పోర్టులను జారీ చేయాలనే ఆలోచనను విరమించుకుంది ఇకమీదట ప్రస్తుతం ఉన్న విధానం కొనసాగుతుందని   ప్రభుత్వం  మంగళవారం ప్రకటించింది.   పాస్‌పోర్ట్‌ చివరి పేజీ ప్రింటింగ్‌లో ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించిందని ఒక ప్రకటనలో విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

దీనిపై రివ్యూ నిర్వహించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్  వివిధ వాటాదారులతో సమగ్ర చర్చలు  చేపట్టారు. అనంతరం  నారింజ రంగు జాకెట్ తో ఒక ప్రత్యేక పాస్‌పోర్ట్‌ జారీ కాదు , చివరి పేజీ ముద్రణలో ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించిందని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి   రవీష్‌ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా ఇమిగ్రేషన్‌ చెక్‌ అవసరం ఉన్న పాస్‌పోర్ట్‌ హోల్డర్లకు ఆరెంజ్‌ రంగు పాస్‌పోర్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది బీజేపీ వివక్షాపూరిత ఆలోచనా ధోరణికి  నిదర్శనమనీ, వలస కార్మికులను రెండో తరగతి పౌరులుగా బీజేపీ పరిగణించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ మండిపడిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు