భారత్‌లో మాంద్యం లేదు

28 Nov, 2019 04:41 IST|Sakshi

ఆర్థికమంత్రి సీతారామన్‌ స్పష్టీకరణ

బడ్జెట్‌లో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు వెల్లడి  

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి వుండవచ్చుకానీ మాంద్యంలోకి మాత్రం జారిపోదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన మొదటి బడ్జెట్‌లో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా అంశాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని వివరించారు. ఆటోమొబైల్‌ వంటి కొన్ని రంగాలు రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆదాయ పరిస్థితులపై ఆందోళనలు అక్కర్లేదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలనూ (2019 ఏప్రిల్‌–అక్టోబర్‌) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, అటు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇటూ వస్తు, సేవల పన్ను వసూళ్లు పెరిగాయని ఆర్థికమంత్రి తెలిపారు. అయితే కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగాన్ని వల్లెవేస్తున్నారు తప్ప, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ఆయా పార్టీలు విమర్శించాయి. వరుసగా రెండు త్రైమాసికాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరక్కపోగా, మైనస్‌లోకి జారితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు.

  ఆర్థిక మంత్రి  సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి చర్యనూ తీసుకోవడం జరుగుతోంది.  

► యూపీఏ–2  ఐదేళ్ల కాలంతో పోల్చిచూస్తే, 2014 నుంచీ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. ద్రవ్యోల్బణం అదుపులో నిర్దేశిత శ్రేణి (2 శాతం ప్లస్‌ లేదా మైనస్‌ 2తో)లో ఉంది. ఆర్థిక వృద్ధి తీరు బాగుంది. ఇతర ఆర్థిక అంశాలు కూడా బాగున్నాయి.  

► గడచిన రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి మందగించిన మాట వాస్తవం. అయితే ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం. రెండవది కార్పొరేట్‌ భారీ రుణ భారం. ఈ రెండు అంశాలూ యూపీఏ పాలనా కాలంలో ఇచ్చిన విచక్షణా రహిత రుణ విపరిణామాలే.  

►  జూలై 5 బడ్జెట్‌ తరువాత బ్యాంకింగ్‌కు రూ.70,000 కోట్ల అదనపు మూలధన మంజూరు జరిగింది.  దీనితో బ్యాంకింగ్‌ రుణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది.  

►  బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) సమస్య లేదు.  

► దివాలా కోడ్‌ వంటి సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.  

► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ వరకూ సెంట్రల్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లు. బడ్జెట్‌ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్‌ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయి. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్‌ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్‌ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లుగా ఉన్నాయి.  

► 2014–15లో జీడీపీలో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి 5.5 శాతం ఉంటే, 2018–19లో ఈ నిష్పత్తి 5.98 శాతానికి పెరిగింది.  

► 2009–14 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 189.5 బిలియన్‌ డాలర్లయితే, తరువాతి ఐదేళ్లలో ఈ మొత్తం 283.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

► 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కాలుష్య ప్రమాణాలు ప్రస్తుత బీఎస్‌ 4 నుంచి బీఎస్‌ 6కు మారాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వాహన రంగంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రభుత్వ చర్యలతో క్రమంగా ఈ రంగం రికవరీ బాట పడుతోంది.

మరిన్ని వార్తలు