ఇప్పట్లో మరో జాబితా లేదు: ఆర్‌బీఐ

17 Jun, 2017 01:12 IST|Sakshi
ఇప్పట్లో మరో జాబితా లేదు: ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తాల్లో రుణాలను ఎగ్గొట్టిన 12 సంస్థలపై ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద చర్యలకు బ్యాంకులను ఆదేశించిన ఆర్‌బీఐ, ఇప్పట్లో మరో జాబితాను విడుదల చేసే ఆలోచనేదీ లేదని స్పష్టం చేసింది. ఇతర రుణ ఎగవేత కేసులను ఆరు నెలల కాల వ్యవధిలోపు పరిష్కరించుకోవాలని బ్యాంకులను ప్రోత్సహిస్తున్నట్టు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా తెలిపారు.

ఈ నేపథ్యంలో వెంటనే రెండో జాబితాను వెల్లడించాల్సిన అవసరమేముందన్నారు. ఢిల్లీలో శుక్రవారం అసోచామ్‌ నిర్వహించిన బ్యాంకర్లు, రుణగ్రహీతల వ్యాపార సదస్సు – 2017కు హాజరైన సందర్భంగా ముంద్రా మాట్లాడారు. జాబితాలోని 12 మంది పేర్ల గురించి అడగ్గా సరైన సమయంలో వెల్లడిస్తామన్నారు.

రూ.10,000 కోట్లు చాలవు...
ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ)కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి రూ.10,000 కోట్ల కంటే ఎక్కువే నిధుల అవసరం ఉంటుందని ముంద్రా అన్నారు. మొండి బాకీలకు నిధుల కేటాయింపులు చేయాల్సి రావడం, ఒత్తిడిని ఎదుర్కొంటున్న రుణాలపై హేర్‌కట్స్‌ రూపేణా అదనపు నిధులు అవసరమన్నారు. అవసరమైతే అదనపు నిధుల సాయం చేస్తామని ఆర్థిక మంత్రి సైతం చెబుతున్నారని ముంద్రా గుర్తు చేశారు. విలీనమా, పునరుద్ధరణా, హేర్‌ కట్‌ (ఒత్తిడిలో ఉన్న రుణాలపై నిర్ణీత శాతం నష్టపోవడం) లేక నిధుల కేటాయింపు వీటిలో ఏదన్నది ఐబీసీలో భాగంగా అనుసరించే విధానాన్ని బట్టి ఉంటుందన్నారు.  

డర్టీ డజన్‌ ఇవే?
బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసిన ‘డర్టీ డజన్‌’ (12 మంది) పేర్లు వెలుగు చూశాయి. వీటిలో ఎస్సాస్‌ స్టీల్, భూషణ్‌ స్టీల్, అలోక్‌ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్, అలోక్‌ ఇండస్ట్రీస్, జేపీ ఇన్‌ఫ్రా, ల్యాంకో ఇన్‌ఫ్రా, మోనెత్‌ ఇస్పాత్, జ్యోతి స్ట్రక్చర్స్, ఆమ్‌టెక్‌ ఆటో, ఎరా ఇన్‌ఫ్రా ఉన్నట్టు సమాచారం. నిజానికి ఈ సంస్థల పేర్లను ఆర్‌బీఐ వెల్లడించలేదు. కానీ, వీటిపై ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్‌ కింద చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వరంగ బ్యాంకులకు జాబితాను పంపింది.

మరిన్ని వార్తలు