ఆర్‌బీఐ డివిడెండ్‌ చిక్కి సగమైంది!

11 Aug, 2017 01:21 IST|Sakshi
ఆర్‌బీఐ డివిడెండ్‌ చిక్కి సగమైంది!

కేంద్రానికి రూ.30,659 చెల్లించడానికి ఓకే
2015–16లో మాత్రం ఈ మొత్తం 65,876 కోట్లు
కొత్త నోట్ల ముద్రణకు భారీ వ్యయం ఓ కారణం
రూపాయి విలువ పెరగటమూ మరో కారణం
రాబడికి ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి!


ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చెల్లించే డివిడెండ్‌ గడిచిన ఆర్థిక సంవత్సరం భారీగా సగానికి సగం పడిపోయింది. ఆర్‌బీఐకి ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగుస్తుంది. ఈ కాలానికి సంబంధించి ఆర్‌బీఐ రూ.30,659 కోట్లు మాత్రమే కేంద్రానికి చెల్లించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.65,876 కోట్లు.

కొత్త నోట్ల ముద్రణ కారణం...
విశ్లేషకుల అంచనా ప్రకారం భారీగా డివిడెండ్‌ పడిపోడానికి ప్రధాన కారణాల్లో... డీమోనిటైజేషన్‌ నేపథ్యంలో– కొత్త నోట్ల ముద్రణకు అయిన వ్యయం ఒకటి. రూ.500 నోటు ముద్రణకు సగటున రూ.2.87 నుంచి రూ.3.09 శ్రేణిలో వ్యయమయితే రూ.2,000 నోటు ముద్రించడానికి సగటున రూ.3.54 నుంచి రూ.3.77 మధ్యలో ఖర్చయిందని ఇటీవలే ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ తెలిపారు. అయితే డీమోనిటైజేషన్‌ అనంతరం కొత్త నోట్ల ముద్రణకు ఆర్‌బీఐ మొత్తంగా ఎంత వెచ్చించిందన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘గురువారం జరిగిన ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశంలో... కేంద్రానికి రూ.30,659 డివిడెండ్‌ చెల్లించడానికి బోర్డు ఆమోదముద్ర వేసింది’అని ఆర్‌బీఐ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. అయితే గత ఏడాదికన్నా తక్కువ డివిడెండ్‌ చెల్లించడానికి గల కారణాలను మాత్రం ప్రకటన వెల్లడించలేదు. అయితే కొత్త నోట్ల ముద్రణ, రివర్స్‌ రెపో ద్వారా అధిక చెల్లింపులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ గణనీయ పెరుగుదల వంటి అంశాలు కూడా కారణాలు కావచ్చని విశ్లేషణలు ఉన్నాయి.

ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం చూపు...
2017–18లో కనీసం రూ.58,000 కోట్లు ఆర్‌బీఐ నుంచి వస్తాయని ప్రభుత్వం భావించింది. బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఆర్‌బీఐ, జాతీయ బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.74,901 కోట్లు డివిడెండ్‌ రూపంలో అందుకోవచ్చని భావించారు. ఆర్‌బీఐ నుంచి డివిడెండ్‌ భారీగా పడిపోవడంతో, కేంద్ర ఆర్థిక ప్రణాళికపై కొంత ఒత్తిడి నెలకొనే పరిస్థితి ఏర్పడింది. 2017–18 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం) నిర్దేశిత 3.2 శాతం వద్ద కట్టడి చేయడానికి అదనపు కసరత్తు చేయాల్సి ఉంది. తాజా పరిణామంపై ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌.గాంధీ మాట్లాడుతూ... గడచిన ఐదేళ్లలో బ్యాంకింగ్‌ రాబడి తగ్గుతూ వస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతికూల వడ్డీరేట్లు దీనికి కారణమని అన్నారు. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెరగడం వల్ల రివర్స్‌ రెపో (బ్యాంకులు తన వద్ద ఉంచిన డిపాజిట్‌పై ఆర్‌బీఐ ఇచ్చే వడ్డీ), సంబంధిత చెల్లింపులు రెవెన్యూపై ప్రభావం చూపుతున్నట్లూ ఆయన విశ్లేషించారు.

మరిన్ని వార్తలు