అన్నకు 2వేల కోట్ల ఆస్తులు అమ్మేసిన తమ్ముడు

23 Aug, 2018 15:28 IST|Sakshi
అంబానీ బ్రదర్స్‌- ముఖేష్‌ అంబానీ, అనిల్‌ అంబానీ (ఫైల్‌ ఫోటో)

ముంబై : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ.. తన తమ్ముడు రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ఆస్తులను ఇతరుల చేతుల్లోకి వెళ్లనీయకుండా తానే దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న అనిల్‌ అంబానీ.. ప్రణాళిక ప్రకారం మీడియా కన్వెర్జెన్స్‌నోడ్స్‌(ఎంసీఎన్‌)ను, సంబంధిత మౌలిక సదుపాయాలను తన అన్న కంపెనీ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు అమ్మేసినట్టు ప్రకటించారు. వీటి విలువ 2000 వేల కోట్ల రూపాయలు. మొత్తం రూ.2000కోట్ల విలువైన ఆస్తులను ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోకు అమ్మే ప్రక్రియ పూర్తయినట్లు అనిల్‌ అంబానీ గురువారం వెల్లడించారు. 248 నోడ్స్‌ దాదాపు 5 మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. వీటిని టెలికాం మౌలిక వసతుల కోసం ఉపయోగిస్తున్నారు. వీటన్నింటిన్నీ ప్రస్తుతం జియోకు బదిలీ చేసినట్లు ఆర్‌కామ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల మొదట్లో కూడా తన రూ.250 బిలియన్‌(రూ.25000 కోట్ల) ఆస్తుల అమ్మకపు ప్రణాళిక ప్రక్రియ నడుస్తుందని ఆర్‌కామ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

‘మా ఎంసీఎన్‌, సంబంధిత మౌలిక సదుపాయల ఆస్తులను రూ.20 బిలియన్లకు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు అమ్మే ప్రక్రియ పూర్తయిందని రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ నేడు ప్రకటిస్తుంద’ని ఆర్‌కామ్‌ పేర్కొంది. గత ఏడాది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌.. రిలయన్స్‌ జియోతో ఒప్పందం కుదర్చుకుంది. భారీగా తనకున్న అప్పులను తగ్గించుకునేందుకు ఆర్‌కామ్‌ వైర్‌లెస్‌ స్పెక్ట్రమ్‌, టవర్‌, ఫైబర్‌ అండ్‌ ఎంసీఎన్‌ ఆస్తులను జియోకు అమ్మేందుకు అంగీకరించింది. 2017 డిసెంబరులోనే ఈ డీల్‌ ప్రకటించారు. 122.4 మెగా హెడ్జ్‌ 4జీ స్పెక్ట్రమ్‌, 43000కు పైగా టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 248 మీడియా కన్వర్జెన్స్‌ నోడ్స్‌ ఈ అమ్మకపు డీల్‌లో ఉన్నాయి. అతిపెద్ద ఈ డీల్‌లో ప్రణాళిక ప్రకారం నేడు నోడ్స్‌ అమ్మకం పూర్తయినట్టు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది.
 

మరిన్ని వార్తలు