ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ

18 Dec, 2019 02:29 IST|Sakshi

పైసా యాప్‌ ఆవిష్కరణ

రూ.1 లక్ష దాకా వ్యక్తిగత రుణాలు,

ఉచిత క్రెడిట్‌ రిపోర్ట్స్, ఇతర సేవలు

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా ఆర్థిక సేవల విభాగంలోకి ప్రవేశించింది. రుణాలు, మ్యూచువల్‌ ఫండ్స్, క్రెడిట్‌ స్కోర్‌ రిపోర్టులు అందించేందుకు ‘రియల్‌మీ పైసా’ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫాం ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో ప్రత్యర్థి సంస్థ షావోమీ ఇటీవలే ’మి క్రెడిట్‌’ పేరుతో ఇలాంటి ఫైనాన్షియల్‌ సర్వీ సులే ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్‌మీ పైసా బీటా యాప్‌ ద్వారా డిజిటల్‌ వ్యక్తిగత రుణాలు సుమారు రూ. 1 లక్ష దాకా, చిన్న.. మధ్యతరహా సంస్థలు  రూ.5 లక్షల దాకా రుణాలు పొంద వచ్చు.

తక్షణ ఉచిత క్రెడిట్‌ రిపోర్టులు, మూడు నెలల పాటు ఉచిత అప్‌డేట్స్, పాత.. కొత్త ఫోన్లకు స్క్రీన్‌ డ్యామేజ్‌ బీమా సరీ్వసులు ఈ యాప్‌ ద్వారా రియల్‌మీ అందించనుంది. 2020లో ఈ ప్లాట్‌ఫాం ద్వారా రూ. 1,000 కోట్ల దాకా రుణ వితరణ, 30–50 లక్షల మంది కొత్త కస్టమర్లకు చేరువ కావాలనేది తమ లక్ష్యమని రియల్‌మీ పైసా లీడ్‌ వరుణ్‌ శ్రీధర్‌ తెలిపారు.  ‘మూడేళ్లలో బ్రేక్‌ ఈవెన్‌ వస్తుందని అంచనా వేస్తు న్నాం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న రియల్‌మీ పైసా యాప్‌.. గూగుల్‌ ప్లేస్టోర్‌తో పాటు రియల్‌మీ యాప్‌స్టోర్‌లో లభిస్తుంది. రానున్న 6–12 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం’ అని  శ్రీధర్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు