రెడీ టు ఈట్ విభాగంలోకి వస్తున్నాం

4 Apr, 2014 03:00 IST|Sakshi
రెడీ టు ఈట్ విభాగంలోకి వస్తున్నాం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల విక్రయ రంగంలో ఉన్న రుచి సోయా ఇండస్ట్రీస్ వచ్చే ఏడాది రెడీ టు ఈట్ విభాగంలోకి ప్రవేశించనుంది. ఇప్పటికే కంపెనీ సోయా ఉత్పత్తులను నూట్రెలా బ్రాండ్‌లో విక్రయిస్తోంది. న్యూట్రెలా ఇన్‌స్టాంట్‌ను ఇటీవలే ఉత్తరాదిన ప్రవేశపెట్టారు. సెప్టెంబరుకల్లా వీటిని దక్షిణాదిన పరిచయం చేయనుంది. అల్పాహార ఉత్పత్తులను కూడా తీసుకొస్తామని రుచి సోయా సీవోవో సతేంద్ర అగర్వాల్ గురువారమిక్కడ తెలిపారు. సంయుక్త భాగస్వామితో కలిసి మార్కెట్లోకి తేనున్నట్టు పేర్కొన్నారు. ప్రీమియం సన్‌ఫ్లవర్ నూనె సన్‌రిచ్‌ను రీబ్రాండ్ చేసి దక్షిణాది మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా కంపెనీ దక్షిణ ప్రాంత వైస్ ప్రెసిడెంట్ అజయ్ మాలిక్, మార్కెటింగ్ హెడ్ అలోక్ మహాజన్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సన్‌ఫ్లవర్ (పొద్దుతిరుగుడు) నూనె అమ్మకాల్లో ఏడాదిలో 10 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు.

 బ్లెండెడ్ ఆయిల్‌లోకి..: మిశ్రమ(బ్లెండెడ్) నూనెల విభాగంలోకి ఏడాదిలో అడుగు పెడతామని సతేంద్ర అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఈ విభాగం వాటా 2-3 శాతం మాత్రమే. వృద్ధి 15-20 శాతముందని తెలిపారు. ‘2013-14లో వంట నూనెల వినియోగం 1.9 కోట్ల టన్నులుంది. ఇందులో ప్యాకేజ్డ్ విభాగం వాటా 90 లక్షల టన్నులు. మొత్తం వినియోగం మూడేళ్లలో 2.2 కోట్ల టన్నులకు చేరుకుంటుందని అంచనా. సగటు వినియోగం ప్రపంచంలో 22 కిలోలుంటే, దేశంలో 14 కిలోలకే పరిమితమైంది. ప్యాకేజ్డ్ నూనెల్లో 70 శాతం వినియోగం దక్షిణాది రాష్ట్రాలదే’ అని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభం మరికొంత కాలం కొనసాగితే సన్‌ఫ్లవర్ నూనె దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన చెప్పారు. ఉక్రెయిన్, రష్యాల నుంచి భారత్ ఏటా 15 లక్షల టన్నుల నూనెను దిగుమతి చేస్తోంది.

మరిన్ని వార్తలు