ఆయనతో వేగలేం | Sakshi
Sakshi News home page

ఆయనతో వేగలేం

Published Fri, Apr 4 2014 2:51 AM

ఆయనతో వేగలేం - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం కోసం శ్రమించిన కార్యకర్తలకు పార్టీలో ప్రాధాన్యత లేదా... కోటరీ మెప్పు పొందినోళ్లకే పెద్దపీట వేస్తున్నారా.. పార్టీలు వేరైనా డబ్బులున్నోళ్లకు అందలం ఎక్కిస్తున్నారా... ఇలాంటి ప్రశ్నలకు తెలుగు తమ్ముళ్ల నుంచి అవుననే సమాధానం విన్పిస్తోంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా పార్టీనే అంటి పెట్టుకున్న నేతలను కాదని, అరువు తెచ్చుకున్న నేతలకు అందలం ఎక్కిస్తున్నారని పలువురు వాపోతున్నారు. అందుకు కారకులైన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 తెలుగుదేశం పార్టీలో సీఎం రమేష్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు నచ్చిన విధంగా వ్యవహరించడం మినహా పార్టీ నేతల మధ్య సమన్వయం పొందుపర్చలేకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతల కంటే డబ్బులు వెచ్చించుకోగల్గే వారికే అధికప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు మండి పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్ లేదని భావించిన నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేక టీడీపీ వైపు చూస్తున్న వారిని ఆహ్వానించి పార్టీకి వాపు వచ్చేలా చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.
 
 అసాంఘీక శక్తులే మిన్నగా....
 మున్సిపల్ ఎన్నికల్లో మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను ప్రోత్సహించిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎర్రచందనం స్మగ్లర్‌ను ప్రోత్సహిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. యర్రగుంట్ల మున్సిపాలిటీ చైర్మన్ పీఠం మట్కా నిర్వాహకుడు జిలానీభాష కుటుంబానికి అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో మట్కా కింగ్‌గా జిలానీబాషగా సుపరిచితుడు. ఈయనపై పలు  పోలీసు కేసులు నమోదయ్యాయి.

మట్కా జిలానీలో మార్పు కోసం గ్రామ బహిష్కరణకు సైతం పోలీసులు ఆదేశించారు. అలాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అక్కున చేర్చుకుంది. అలాగే రాయలసీమలో నెంబర్-1 క్రికెట్ బుకీగా పేరున్న గౌస్ కుటుంబాన్ని పరిగణలోకి తీసుకుంది. గౌస్ సోదరుడు మహమ్మద్ఫ్రీని  ప్రొద్దుటూరు 18వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేయించారు. మహమ్మద్ఫ్రీ సైతం క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. ఇవన్నీ అటుంచితే మరో అడుగు ముందుకేసి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎర్రచందనం స్మగ్లర్‌ను ప్రోత్సహించారు. ఎర్రచందనం అక్రమరవాణాలో బడా స్మగ్లర్‌గా పేరుగాంచిన రెడ్డినారాయణను సంబేపల్లె జెడ్‌పీటీసీగా నిలపడంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు.
 
 ఎర్రచందనం అక్రమ రవాణాలో పలు కేసులు ఉండడమే కాకుండా పీడీ యాక్టు సైతం రెడ్డినారాయణపై నమోదు అయింది. అయినప్పటికీ ఎన్నికల ఖర్చు భరించగల్గే వారైతే చాలన్నట్లుగా రెడ్డినారాయణను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపినట్లు పలువురు పేర్కొంటున్నారు.  సీఎం రమేష్ లాంటి హైటెక్ నేతల కారణంగా తెలుగుదేశం పార్టీ ఆసాంఘీక శక్తులకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
 పార్టీ పరువు గంగలో కలుస్తోంది....
 ఎంపీ రమేష్ కారణంగా పార్టీ పరువు గంగలో కలుస్తోందని తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు మదనపడుతున్నారు. కడప పార్లమెంటు టికెట్ విషయంలో కూడా నాన్‌లోకల్ వ్యక్తికి అప్పగించేలా సిఫార్సు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పార్టీ ఉన్నతి కోసం కాకుండా వ్యక్తిగత ఇమేజ్ పెంపొందించుకోవడమే లక్ష్యంగా రమేష్ వైఖరి ఉందని ఆపార్టీ సీనియర్ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
 
 మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డి లాంటివారిని కాదని, రాజంపేట పార్లమెంటు పరిధికి చెందిన లక్కిరెడ్డిపల్లె శ్రీనివాసులరెడ్డి పేరును కడప పార్లమెంటుకు సిఫార్సు చేయడం వెనుక రమేష్ స్వలాభపేక్ష దాగుందని పలువురు ఆరోపిస్తున్నారు. సీనియర్ నేతలను కాదని ఏకపక్షంగా సీఎంరమేష్ వ్యవహరిస్తున్నారని, ఆయనను నియంత్రించకపోతే పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకం కానుందని పలువురు చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన లేఖలో పొందుపర్చినట్లు సమాచారం.
 

Advertisement
Advertisement