‘ఆర్‌వీ400’ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఆవిష్కరణ

19 Jun, 2019 11:23 IST|Sakshi

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత బైక్‌

ఒక్కసారి చార్జింగ్‌తో 156 కి.మీ ప్రయాణం  

న్యూఢిల్లీ: అంకుర ఎలక్ట్రిక్‌ సంస్థ రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌.. ‘ఆర్‌వీ400’ పేరిట తన అధునాతన ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను మంగళవారం ఆవిష్కరించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఈ బైక్‌... ఒక్కసారి చార్జ్‌ చేస్తే 156 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. బ్యాటరీని పూర్తిగా చార్జ్‌ చేయడానికి నాలుగు గంటలు పడుతుండగా.. చార్జింగ్‌ ఇబ్బందులను అధిగమించడం కోసం ఆన్‌ బోర్డ్, పోర్టబుల్‌ చార్జింగ్‌తో పాటు హోమ్‌ డెలివరీ ఆప్షన్లను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. వచ్చే నాలుగు నెలల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ బైక్‌లు అందుబాటులోకి రానున్నాయి.

ఇందులో భాగంగా జూన్‌ 25 నుంచి ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభంకానున్నట్లు తెలిపింది. కంపెనీ సొంత వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లోనూ ప్రీ–బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. తొలుత హైదరాబాద్, ఢిల్లీ–ఎన్‌సీఆర్, పుణే, బెంగళూరు, నాగ్‌పూర్, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. ‘ప్రతి భారతీయ ఇంటికి అందుబాటు ధరల్లో వాహనాలను అందించే దిశగా కొనసాగుతున్న మా ప్రయాణానికి ఇది మొదటి అడుగుగా భావిస్తున్నాం’ అని అన్నారు. ఇక హరియాణాలో ఏటా 1.2 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను కంపెనీ కలిగి ఉంది.

మరిన్ని వార్తలు