మందకొడిగా మార్కెట్‌

21 Jun, 2017 00:56 IST|Sakshi
మందకొడిగా మార్కెట్‌

స్వల్పంగా తగ్గిన సూచీలు
ముంబై: క్రితం రోజు కదంతొక్కిన స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం మందకొడిగా ట్రేడయ్యింది. స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన స్టాక్‌ సూచీలు కొద్దిపాటి నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 31,392–31,261 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య కదిలిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 14 పాయింట్ల నష్టంతో 31,298 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 9,674–9,643 పాయింట్ల మధ్య 30 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 9,653 పాయింట్ల వద్ద ముగిసింది. గతరాత్రి అమెరికా మార్కెట్‌ రికార్డు గరిష్టస్థాయికి ర్యాలీ జరిపినప్పటికీ, మంగళవారం జపాన్‌ మినహా మిగిలిన ప్రధాన ఆసియా సూచీలు, యూరప్‌ మార్కెట్లు క్షీణించిన ప్రభావం ఇక్కడి ట్రేడింగ్‌పై పడిందని బ్రోకింగ్‌ వర్గాలు తెలిపాయి.

టాటా మోటార్స్‌ అప్‌...
టాటా గ్రూప్‌నకు చెందిన లగ్జరీ కార్ల తయారీ సబ్సిడరీ జాగ్వర్‌ లాండ్‌రోవర్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ జారీచేయనున్నదనే వార్తలతో టాటా మోటార్స్‌ షేరు 3.28 శాతం ర్యాలీ జరిపి రూ. 467 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ షేర్లలో బాగా పెరిగిన షేరు ఇదే. ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, సిప్లాలు 1 శాతంపైగా పెరిగాయి. అయితే పవర్‌గ్రిడ్, లుపిన్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటోలు 1–2 శాతం మధ్య క్షీణించాయి.

మరిన్ని వార్తలు