మార్కెట్‌ అక్కడక్కడే 

15 Nov, 2018 00:46 IST|Sakshi

తీవ్ర హెచ్చుతగ్గుల్లో స్టాక్‌ సూచీలు 

తగ్గిన చమురు ధరలు  బలపడిన రూపాయి 

365 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌

3 పాయింట్ల నష్టంతో 35,142 వద్ద ముగింపు 

6 పాయింట్లు తగ్గి 10,576కు నిఫ్టీ  

రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ చివరకు అక్కడక్కడే ముగిసింది. ఇంధన, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల లాభాలను ఫార్మా, ఐటీ, వాహన, లోహ, రియల్టీ షేర్లు హరించివేయడంతో స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్‌లో తీవ్రమైన ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ, సెన్సెక్స్‌ 35,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్ల ఎగువున ముగిశాయి. రోజంతా 365 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 3 పాయింట్ల నష్టంతో 35,142 పాయింట్ల వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 10,576 పాయింట్ల వద్ద ముగిశాయి.  

లాభాల స్వీకరణ... 
బ్యారెల్‌ చమురు ధర 65 డాలర్లకు దిగువకు పడిపోవడంతో కరంట్‌  అకౌంట్‌ లోటుపై ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి.  మరో వైపు రూపాయి బలపడటంతో ఐటీ, ఫార్మా షేర్లు నష్టపోయాయి. చమురు ధరలు పడిపోయినా, రూపాయి పుంజుకున్నా, ఇటీవల పెరిగిన కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్‌ సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయితే టోకు ధరల ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ట స్థాయి, 5.28 శాతానికి పెరగడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించింది.  

ఆరంభం అదిరినా... 
సెన్సెక్స్‌ 186  పాయింట్ల లాభంతో ఆరంభమైంది. ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో 208 పాయింట్ల లాభంతో 35,352 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆసియా మార్కెట్ల బలహీనతకు తోడు యూరప్‌ మార్కెట్లు కూడా బలహీనంగా ఆరంభం కావడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఇంట్రాడేలో 157 పాయింట్ల నష్టంతో 34,987 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా 365 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  

►అశోక్‌ లేలాండ్‌ కంపెనీ సీఈఓ వినోద్‌ కె. దాసరి రాజీనామా చేయడంతో అశోక్‌ లేలాండ్‌ షేర్‌ 10.4 శాతం పతనమై రూ.107 వద్ద ముగిసింది.  
►ఐసీఐసీఐ బ్యాంక్‌  ఆల్‌టైమ్‌ హై,రూ.369ను తాకింది. చివరకు 1.5 శాతం లాభఃతో రూ.366 వద్ద ముగిసింది. ఈ ఏడాది జూలై 16న ఈ షేర్‌ ఏడాది కనిష్ట స్థాయి, రూ.257ను తాకింది. ఆ ధర నుంచి చూస్తే 42 శాతం ఎగసింది. క్యూ2 ఫలితాలు అంచనాలను మించడంతో ఈ షేర్‌ జోరుగా పెరుగుతోంది.  
​​​​​​​►   ఈ క్యూ2లో రూ.219 కోట్ల నికర నష్టాలు రావడంతో సన్‌ ఫార్మా షేర్‌ 7.3 శాతం క్షీణించి రూ.520 వద్ద ముగిసింది.  

>
మరిన్ని వార్తలు