వేతనాల పెంపు భారం కాదు...

21 Nov, 2015 02:14 IST|Sakshi
వేతనాల పెంపు భారం కాదు...

న్యూఢిల్లీ: ఏడవ వేతన సవరణ సంఘం సిఫారసులు కేంద్ర పటిష్ట ద్రవ్య పరిస్థితులకు ఇబ్బంది కల్పించబోదని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది.  ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం దారితప్పదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు జీత భత్యాలు, పింఛను 23.55 శాతం వరకూ పెంచుతూ జస్టిస్ ఏకే మాథుర్ నేతృత్వంలోని సంఘం సిఫారసులు చేసింది.

ఈ సిఫారసుల అమలుకు కేంద్రం అదనంగా ఏడాదికి రూ. 1.02 లక్షల కోట్లను భరాయించాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ద్రవ్యలోటు లక్ష్య సాధన భరోసా ప్రకటనలు వెలువడుతున్నాయి.  అయితే ద్రవ్యలోటు లక్ష్య కట్టడి కష్టమేనని ఫిచ్, ఎస్‌అండ్‌పీ వంటి రేటింగ్ సంస్థలు, సిటీ గ్రూప్ వంటి బ్రోకరేజ్ సంస్థలు  పేర్కొంటున్నాయి. తాజా పరిణామంపై ఆర్థిక కార్యదర్శి శుక్రవారం మాట్లాడుతూ,  వేతన సవరణ సంఘం సిఫారసుల భారం గురించి కొంత ముందుగా ఊహించిందేనని అన్నారు.  2016 జనవరి 1 నుంచీ ఈ సిఫారసులు అమలు చేయాలన్న విషయం ప్రభుత్వానికి తెలుసని పేర్కొన్నారు.    
 
2016-17లో సవాలే: సిటీ గ్రూప్
2016-17 ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యం ఇప్పుడు మరింత సవాలుగా మారింది. వేతన పెంపు భారం వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.5%గా ఉంటుందన్నది అంచనా. కార్పొరేట్ పన్ను రేటును ప్రస్తుత 30 శాతం నుంచి దశలవారీగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే తగ్గిస్తున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఆయా అంశాల నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్య సాధన మరింత క్లిష్టతరం కానుంది.
 
ద్రవ్యలోటు కట్టడి కష్టమే: ఎస్‌అండ్‌పీ
పే కమిషన్ సిఫారసు ప్రభుత్వ ద్రవ్య పరిస్థితిపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ క్రమంలో 2016-17లో 3.5% వద్ద ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం కష్టమే.
 
అదనపు ఆదాయాలపై దృష్టి పెట్టాలి: ఫిచ్
తాజా సిఫారసుల అమలుతో ప్రభుత్వ వేతన బిల్లు తడిసి మోపెడవుతుంది. ద్రవ్యలోటు లక్ష్యాలకు ఇది విఘాతం కలిగించే అంశమే. వేతన కమిటీ సిఫారసుల అమలు కోసం కేంద్రం ఇతర విభాగాల్లో వ్యయాలు తగ్గించుకునే వీలుంది. అయితే  పెట్టుబడులు, వ్యయాల్లో కోతలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడే అంశం కాదు. సవాళ్ల నుంచి గట్టెక్కడానికి కేంద్రం అధిక ఆదాయ సమీకరణలపై దృష్టి సారించే అవకాశం ఉంది.
 
వినియోగం రికవరీ: బీఓఎఫ్‌ఏ-ఎంఎల్
వేతన పెంపు సిఫారసుల అమలు దేశ వినియోగ విభాగంలో రికవరీని భారీగా పెంచడానికి దోహదపడుతుంది. వినియోగ వస్తువులు, హౌసింగ్ రంగాల్లో ప్రధానంగా డిమాండ్ మెరుగుపడే వీలుంది.
 
ద్రవ్యలోటు అంటే..
ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు.  ద్రవ్యలోటు ఈ ఆర్థిక సంవత్సరం రూ.5.55 లక్షల కోట్లు(మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 3.9%) మించకూడదన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే ఈ లోటు 3.78 లక్షల కోట్లకు చేరింది. 2014-15లో ద్రవ్యలోటు రూ.5.01 లక్షల కోట్లు. జీడీపీలో ఇది 4%. 2016-17లో ఈ లక్ష్యం 3.5 శాతం.

మరిన్ని వార్తలు