వేయి పడగల ఉగ్రసర్పం | Sakshi
Sakshi News home page

వేయి పడగల ఉగ్రసర్పం

Published Sat, Nov 21 2015 9:59 AM

వేయి పడగల ఉగ్రసర్పం

♦ అంతకంతకూ విస్తరిస్తున్న ఉగ్రవాదం
♦ పదిహేనేళ్లలో పదింతలు పెరిగిన దాడులు

 
2000 - 2015 మధ్య లక్షన్నర మంది బలి 
2000లో చనిపోయింది 3,329 మంది
2014 లో 32,658 మందికి పెరిగిన మృతులు 
మూడు వంతుల దాడులు 5 సంస్థలవే
గ్లోబల్ టైజం ఇండెక్స్ నివేదికలో వెల్లడి

 
సెంట్రల్ డెస్క్ : ముంబై, బీరుట్, పారిస్, బాలి, మాలి... ఇక్కడా అక్కడా అని కాదు ప్రపంచమంతటా ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఎక్కడ ఎప్పుడు ఎటునుంచి ఉగ్రవాదులు విరుచుకుపడతారో తెలియని పరిస్థితి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఉగ్రవాదులు ఒక్కరుగా, ఇద్దరుగా, గుంపుగా.. ఎలాగైనా పంజా విసురుతున్నారు. తుపాకీ కాల్పులు, బాంబులతో దాడులే కాదు.. తామే మానవబాంబులుగా మారి మారణహోమం సృష్టిస్తున్నారు. గత పదిహేనేళ్లలో దాదాపు లక్షన్నర మందిని బలితీసుకున్నారు. అంతకుముందు చెదురుమదురుగా ఉన్న ఉగ్రవాదులు.. ఉగ్రవాద దాడులు.. 21వ శతాబ్దం ఆరంభం నుంచీ విశ్వవ్యాప్తమయ్యాయి. ఈ పదిహేనేళ్లలో ఏకంగా పది రెట్లు పెరిగిపోయాయి.

2000 సంవత్సరంలో ఉగ్రవాద దాడుల్లో 3,329 మంది చనిపోతే.. 2014లో ఆ సంఖ్య 32,658కి పెరిగిపోయింది. ఉగ్రవాద దాడుల రూపురేఖలూ మారిపోయాయి. గతంలో ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు.. లేదంటే, మత పెద్దలు లక్ష్యంగా సాగిన ఉగ్రదాడులకు.. ఇప్పుడు సాధారణ పౌరులే లక్ష్యంగా మారిపోయారు. ప్రపంచంలోని 123 దేశాలు ఉగ్రవాద రక్తదాహాన్ని చవిచూశాయి. ప్రధానంగా.. మధ్య ఆసియా - ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా, సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలు ఉగ్రవాద కోరల్లో చిక్కుకుని నిత్యం రక్తమోడుతున్నాయి. ఈ దాడులు పాశ్చాత్య దేశాలకూ వేగంగా విస్తరిస్తున్నాయి.

అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడుల్లో ముప్పావు భాగం.. ఐదు ప్రధాన ఉగ్రవాద సంస్థలవేనని తాజా లెక్కలు చెప్తున్నాయి. 2014లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉగ్రదాడులు, వాటిలో మరణాల సంఖ్యను బట్టి ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకానమిక్ అండ్ పీస్’ అనే సంస్థ రూపొందించిన గ్లోబల్ టైజం ఇండెక్స్ నివేదిక ఈ విషయాన్ని చెప్తోంది. ఆ ఐదు ఉగ్రవాద సంస్థల సమాచారం ఇదీ...
 
బోకో హరమ్
దేశాలు: నైజీరియా, కామరూన్, చాద్, 2014లో దాడుల సంఖ్య: 453, మృతులు: 6,644, క్షతగాత్రులు: 1,742 (మృతుల్లో 77% మంది సాధారణ పౌరులు)
 
బోకో హరమ్ అంటే.. ‘పాశ్చాత్య విద్య నిషిద్ధం’ అని అర్థం. జమాత్ అల్ అస్-సున్నా లిద్-దావా వాల్-జిహాద్ అని కూడా ఈ సంస్థ పేరు. ఇటీవలే ఐసిస్ అనుబంధ సంస్థగా ‘ఇస్లామిక్ స్టేట్స్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్’ అని పేరు మార్చుకుంది. 2009లో నైజీరియా ప్రభుత్వంతో వివాదంలో తమ నేత మొహమ్మద్ యూసుఫ్ హత్యానంతరం ఈ సంస్థ హింసకు తెరలేపింది. కొత్త నేత అబుబకర్ షెకావ్ 2010లో నైజారియా, అమెరికా ప్రభుత్వాలపై జిహాద్ ప్రకటించాడు. క్రైస్తవులు, ముస్లింలు ప్రధానంగా ఉన్న నైజీరియాలో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించటం లక్ష్యం. తొలుత అల్‌ఖైదా నుంచి, తర్వాత ఐసిస్ నుంచి ఉగ్రవాద శిక్షణ, నిధులు పొందుతోంది. నైజీరియాతో పాటు.. పొరుగు దేశాలైన కామరూన్, చాద్‌లలోనూ ఉగ్రదాడులకు తెగబడుతోంది. ఈ ఏడాది జనవరిలో ఒక పదేళ్ల వయసు బాలికకు బాంబు అమర్చి మైదుగురిలో మండే మార్కెట్‌లో పేల్చివేయటంతో 20 మంది చనిపోయారు. ఈ ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ నైజీరియాలోని బాగా పట్టణంలో 2,000 మందిని ఊచకోత కోసింది.
 
ఐసిస్ (ఐఎస్‌ఐఎస్)
దాడులకు గురైన దేశాలు: ఈజిప్ట్, ఇరాక్, లెబనాన్, సిరియా,
ఫ్రాన్స్, టర్కీ. 2014లో దాడుల సంఖ్య:1,071, మృతులు:6,073
(44% మంది సాధారణ పౌరులు), క్షతగాత్రులు: 5,799

 
ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియాగా, ఐఎస్‌ఐఎల్‌గా, దాయెష్‌గా, ఇస్లామిక్ స్టేట్‌గా ఇది ప్రాచుర్యం పొందింది. 1999లో ఇరాక్‌లో అల్-తాహిద్ వల్-జిహాద్ పేరుతో పుట్టిన సంస్థ 2004లో అల్‌ఖైదాతో చేతులు కలిపింది. సిరియా అంతర్యుద్ధం నేపధ్యంలో అక్కడ ప్రవేశించి, మరికొన్ని ఉగ్రవాద సంస్థలను కలుపుకుని 2013 నాటికి ఐసిస్‌గా అవతరించింది. గత ఏడాది ఫిబ్రవరిలో అల్‌ఖైదాతో తెగతెంపులు చేసుకుంది. సిరియాలో, ఇరాక్‌లో పలు ప్రాంతాలను స్వాధీనంలోకి తెచ్చుకుని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించినట్లు ప్రకటించింది. ‘పవిత్ర యుద్ధం’ పేరుతో హింసకు పాల్పడుతోంది. సంస్థ నేత అల్-బగ్ధాదీని ఖాలిఫ్‌గా ప్రకటించి.. తమ ఇస్లామిక్ రాజ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తామంటూ మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. ఇరాక్, సిరియా ప్రభుత్వాలతో యుద్ధాల్లోనే 20 వేల మందికి పైగా చనిపోయారు. ఈ మరణాలను కూడా కలిపితే.. ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక ఉగ్రవాద సంస్థగా ఐసిస్ అగ్రస్థానంలో ఉంటుంది. గత ఏడాది 117 ఆత్మాహుతి దాడుల్లోనే 1,101 మందిని బలితీసుకుంది.
 
తాలిబాన్
దాడులకు గురైన దేశాలు: అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్
2014లో దాడుల సంఖ్య: 891, మృతులు: 3,477 (20 శాతం మంది సాధారణ పౌరులు), క్షతగాత్రులు: 3,310

 
అఫ్ఘానిస్తాన్‌లో 1980ల్లో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్లు, పస్థూన్ గిరిజనులతో కలిపి 1994లో మొహమ్మద్ ఒమర్ స్థాపించిన సంస్థ ఇది. 1996లో దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తాలిబన్లు 2001 వరకూ పరిపాలన కొనసాగించారు. న్యూయార్క్ 9/11 దాడుల నేపధ్యంలో అఫ్ఘాన్‌పై దండెత్తిన అమెరికా.. తాలిబన్లను తరిమివేసింది. అనంతరం మళ్లీ జట్టుకట్టిన తాలిబన్లు అఫ్గాన్ ప్రస్తుత ప్రభుత్వం, నాటో సైన్యాలపై ఉగ్రదాడులకు దిగుతున్నారు. 2002లో అఫ్ఘానిస్తాన్ ఆక్రమణ నాటి నుంచీ చూస్తే తాలిబన్లు 2014లోనే ఎక్కువ మందిని ఉగ్రదాడుల్లో బలితీసుకున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఆ తర్వాత సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. 2014 నవంబర్‌లో కాబూల్‌లో బ్రిటిష్ దౌత్యకార్యాలయంపై ఆత్మాహుతి దాడి, ఆ ఏడాది జనవరిలో సింద్‌బాద్‌లో గవర్నర్ కాన్వాయ్‌పై దాడి ప్రభుత్వ లక్ష్యంగా చేసినవే. ఇక అఫ్ఘాన్ సర్కారుతో యుద్ధంలో గత ఏడాది వరకూ 15,675 మంది చనిపోయారు.
 
ఫులాని ఉగ్రవాదులు
దాడులకు గురైన దేశాలు: నైజీరియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
2014లో దాడుల సంఖ్య: 154, మృతులు: 1,229 (92 శాతం మంది సాధారణ పౌరులు), క్షతగాత్రులు: 395

 
నైజీరియాలో అర్ధ సంచార, పశుపోషణ జాతుల నుంచి పుట్టికొచ్చిన ఉగ్రవాదులు ఫులానీ మిలిటెంట్లు. పశ్చిమ ఆఫ్రికాలోని ఏడు దేశాల్లో దాదాపు రెండు కోట్ల మంది ఫులానీ జాతి ప్రజలు నివసిస్తున్నారు. నైజీరియాలో వనరుల విషయమై స్థానిక రైతాంగానికి, ఫులానీ ప్రజలకు మధ్య ఏళ్ల తరబడి ఘర్షణ సాగుతోంది. బోకో హరమ్ కార్యకలాపాలు పెరగటంతో నైజీరియాలో భద్రత అస్థిరమవగా 2014లో ఫులానీ మిలిటెంట్ల దాడులు అమాంతం పెరిగిపోయాయి. అప్పటివరకూ పెద్దగా తెలియని వీరు పేరు ఆ తర్వాత క్రమంగా వినిపించటం మొదలైంది. 2010 నుంచి 2013 మధ్య సుమారు 80 మందిని చంపిన మిలిటెంట్లు.. గత ఏడాది ఏకంగా 1,229 మందిని బలితీసుకున్నారు. నైజీరియాలో మొత్తం 36 రాష్ట్రాలు ఉంటే.. ఆరు రాష్ట్రాల్లోనే ఈ మిలిటెంట్ల దాడులు అధికంగా ఉన్నాయి. వీరి దాడుల్లో ప్రధానంగా బలయ్యేది సాధారణ పౌరులైన స్థానిక రైతాంగమే. 2014 ఏప్రిల్‌లో గాలాదిమా అనే గ్రామంలో సమావేశమైన గ్రామ పెద్దలు, గ్రామస్తులపై ఫులానీ ఉగ్రవాదులు కాల్పులు జరిపి 200 మందిని చంపేశారు.
 
అల్ షబాబ్
దాడులకు గురైన దేశాలు: సోమాలియా, కెన్యా, ఇథియోపియా,
ద్జిబౌటి. 2014లో దాడుల సంఖ్య: 496, మృతులు: 1,021
(36% మంది సాధారణ పౌరులు), క్షతగాత్రులు: 850

 
హర్కత్ అల్-షబాబ్ అల్-ముజాహిదీన్ అనే ఈ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అనుబంధ సంస్థ. సోమాలియాలో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా ఉగ్రవాద దాడులకు పాల్పడుతోంది. దేశ రాజధాని మొగదిషు సహా పలు నగరాల్లోని చాలా ప్రాంతాలను గతంలో ఈ సంస్థ ఆధీనంలోకి తీసుకుంది. అయితే.. ఆఫ్రికన్ యూనియన్ సైనిక చర్య కారణంగా ఆ సంస్థ ఆయా ప్రాంతాలపై పట్టు కోల్పోయింది. అయినా.. 2014లో ఈ సంస్థ మారణకాండ సృష్టించింది. మూడు వంతులు సోమాలియాలో, ఆ తర్వాత కెన్యాలో దాడులు చేసింది. కెనడా, బ్రిటన్, అమెరికాల్లోని షాపింగ్ మాల్స్‌పై దాడులు చేయాలని పిలుపునిచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ బలగాలపై దాడులు చేసే ఈ సంస్థ.. గత ఏడాది జుబాలాంద్‌లో పారామిలటరీపై దాడి చేసి 91 మందిని బలితీసుకుంది. కిడ్నాపులు కూడా ఈ సంస్థ ఆపరేషన్లలో భాగం. అల్‌షబాబ్‌లో బ్రిటన్, అమెరికాల నుంచి సభ్యులు వచ్చి చేరినప్పటికీ.. వారు తూర్పు ఆఫ్రికా వెలుపల ఎక్కడా దాడులు నిర్వహించలేదు.
 
మాలి దాడుల నేపథ్యం

ఆఫ్రికా దేశమైన మాలి మూడేళ్లుగా టైజంలో అల్లాడిపోతోంది. 2012లో అప్పటి మాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు ఆదేశంలో ఉగ్రవాదానికి కారణమైంది. త్వారెగ్ సంచార తెగకు చెందిన తిరుగుబాటుదారులు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండా ఎగరేశారు. మాజీ లిబియన్ సైనికులతో ఏర్పాటైన ‘నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ అజావద్’ ఆ తిరుగుబాటుకు మద్దతిచ్చింది. మాలి ఉత్తర ప్రాంతంలోని అజావద్‌ను తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్నారు. వారికి అన్సర్ థైస్, అల్‌ఖైదా గ్రూపు మద్దతు ప్రకటించాయి. తిరుగుబాటుదారులను అణచివేసేందుకు 2013లో ఫ్రెంచ్ సైన్యం ఆపరేషన్ నిర్వహించింది. ఉగ్రవాదులు.. దక్షిణ ప్రాంతాలను ఆక్రమించుకునే ప్రయత్నం మొదలెట్టారు. మార్చి 6న తీవ్రవాదులు బమాకాలోని ఓ రెస్టారెంటుపై దాడిచేసి ఐదుగురిని కాల్చి చంపారు. ఐక్యరాజ్యసమితి తరపున 12 వేల మంది సైనికులు మాలిలో భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement