రెండు కుటుంబాల్లో విషాదం

26 Mar, 2019 13:20 IST|Sakshi
శ్రీనివాసులు (ఫైల్‌) , రామమోహన(ఫైల్‌)

జనసేన ప్రచార వాహనం రూపంలో ఇద్దరు విద్యార్థులను కబళించిన మృత్యువు

మరో ఆరుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు

చిత్తూరు, పెద్దమండ్యం : పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థులు విగతజీవులుగా తిరిగిరావడంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. జనసేన ప్రచార వాహనం రూపంలో మృత్యువు ఇద్దరు విద్యార్థులను కబళించింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కలిచెర్ల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు పెద్దమండ్యంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రోజులాగే కోటకాడపల్లె పంచాయతీలోని శెట్టివారిపల్లె, గుర్రంవాండ్లపల్లె, కలిచెర్ల, గుర్రంకొండ మండలంలోని టి.పసలవాండ్లపల్లెలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు కలిచెర్ల బస్టాండుకు చేరుకున్నారు. కలిచెర్ల గ్రామంలోని వడ్డిపల్లెలో జనసేన పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి విశ్వం ప్రభాకరరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన క్వాలీస్‌ వాహనానికి కలిచెర్లకు చెందిన శంకర డ్రైవర్‌గా ఉన్నారు. అతను వడ్డిపల్లె నుంచి పెద్దమండ్యంకు క్వాలీస్‌ వాహనాన్ని తీసుకొస్తూ కలిచెర్ల బస్టాండులో ఉన్న విద్యార్థులను పిలిచి ఎక్కించుకున్నాడు. క్వాలీస్‌లో మొత్తం 8మంది విద్యార్థులు ఎక్కారు. అనంతరం డ్రైవర్‌ వాహనాన్ని వేగంగా నడపడంతో రెక్కలకొండపల్లె బస్టాప్‌ వద్ద వాహనం బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో శెట్టివారిపల్లెకు చెందిన గెంగిశెట్టిగారి రెడ్డెప్ప కుమారుడు శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాల పాలైన కలిచెర్లకు చెందిన చంద్ర కుమారుడు రామమోహన మదనపల్లెకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గెంగిశెట్టి శ్రీనివాసులు తండ్రి రెడ్డెప్ప, తల్లి భారతి, సోదరి సుభాభాషిణి పీలేరులో మేస్త్రీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్న శ్రీనివాసులు పరీక్షల కోసం నెలక్రితం శెట్టివారిపల్లెకు వచ్చాడు. శెట్టివారిపల్లెలో తాత రెడ్డెప్ప, అవ్వ వెంకటసుబ్బమ్మల సంరక్షణలో ఉంటూ పరీక్షలు రాస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుని మృతితో తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ప్రమాదం గురించి తెలుసుకున్న శెట్టివారిపల్లె గ్రామస్తులుపెద్ద ఎత్తున పెద్దమండ్యం చేరుకున్నారు. స్థానిక పీహెచ్‌సీ వద్దకు చేరుకున్న గ్రామస్తులు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన అభ్యర్థి విశ్వం ప్రభాకరరెడ్డిని కోరారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో మృతిచెందిన మరో విద్యార్థి రామమోహన చదువులో మేటి అని ఉపాధ్యాయులు తెలిపారు. కలిచెర్లకు చెందిన చంద్రకు అతను రెండో కుమారుడు. వారపుసంతల్లో కూరగాయలు అమ్ముకుని వీరు జీవనం సాగిస్తున్నారు. ప్రమాదంలో బిడ్డ మృతిచెందినట్లు తెలియడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. విద్యార్థుల మృతితో కలిచెర్ల, శెట్టివారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. కలిచెర్ల ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయులు సెలవు ప్రకటించారు.

మరిన్ని వార్తలు