మోటార్ సైకిళ్ల చోరి ముఠా అరెస్టు

3 Jun, 2016 10:02 IST|Sakshi

- భారీగా మోటారు సైకిళ్లు స్వాధీనం
- 113 గ్రాముల బంగారు, 4 వందల కేజీల వెండి అభరణాలు స్వాధీనం
- పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
కొవ్వూరు: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇంటి దొంగతనాలు, మోటారు సైకిళ్ల చోరీ,  చైన్ స్నాచింగ్స్‌కి పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను కొవ్వూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున మోటారు సైకిళ్లు, 113 గ్రాముల బంగారు, 403 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. టోల్‌గేట్ జంక్షన్ వద్ద నేర పరిశోధన పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. గత నెల14న పట్టణంలో కొవ్వూరు రౌండ్‌ పార్కు వద్ద మహిళ మెడలో గొలుసు దొంగతనానికి మట్టా దినేష్, వల్లూరి కిషోర్‌కుమార్ లు పాల్పడ్డారు. పోలీసులు మోటారు సైకిళ్లు తనిఖీ చేస్తుండగా వీరు కొవ్వూరులో దొరికారు. విచారించగా వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడినట్టు తెలిపారు.

వీరు అందించిన సమాచారంతో పోతురాజు దిబ్బ ఏరియాలో రెండిళ్లలో చోరీకి  పాల్పడిన గోడి సతీష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 43 గ్రాముల బంగారు ఆభరణాలు, 403 కేజీల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొంతమూరుకి చెందిన రౌతు శ్రీనివాస్, రాజమహేంద్రవరం సిద్దార్థ నగర్‌కి చెందిన యనగంటి సూరిబాబులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా కాకినాడ, తణుకు, రాజమండ్రి, విజయవాడ, కొవ్వూరు, దేవరపల్లి, భీమవరం తదితర ప్రాంతాల్లో  మోటారు సైకిళ్లు చోరీలు చేసిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన ముత్యాల చిట్టి వీరన్న అనే వ్యక్తి ద్వారా ఇరువురు విక్రయానికి ఉంచిన 12 మోటారుసైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. మోటారు సైకిళ్ల చోరీలకు సంబంధించి వీరిపై 22 కేసులు నమోదయినట్టు డీఎస్పీ తెలిపారు. పట్టణ సీఐ పి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్, క్రైం ఎస్సైలు కేవీ రమణ, బీ శ్రీనివాస్ సింగ్, ఏఎస్సై ఎస్.శ్రీనివాసరావు, హెచ్‌సీలు పీఎన్ శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు ప్రసాద్, శ్రీనివాస్, జయరామ్, విజయకుమార్ ఈ చోరీల కేసును చేధించినట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు