ఈ రోజు నేనేం చేశానంటే..!

30 Nov, 2015 09:39 IST|Sakshi
- కమిషనరేట్ లో అన్ని స్ధాయిల సిబ్బందికీ డీపీఆర్స్
- ప్రతి రోజు కంప్యూటర్లో అప్లోడ్ కు ఆదేశాలు
 
హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60 శాంతి భద్రతల విభాగం పోలీసుస్టేషన్లు, మరో మూడు మహిళా ఠాణాలతో పాటు ప్రత్యేక వింగ్స్ ఉన్నాయి. వీటిలో వందల మంది అధికారులతో పాటు వేలమంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరు ప్రతి రోజూ ఏం చేస్తున్నారు? ఏ విధమైన విధులు నిర్వర్తిస్తున్నారు? తదితర అంశాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి రావట్లేదు. కేవలం వారికి నేతృత్వం వహిస్తున్న అధికారులకు తప్ప ఇంకెవరికీ తెలియక పోవడంతో పాదర్శకత లోపించింది. ఇదే అనేక సందర్భాల్లో మానవవనరుల దుర్వినియోగంతో పాటు సిబ్బందిని వెట్టి చాకిరీకి వినియోగించుకోవడానికీ ఆస్కారం ఇస్తోంది. ఈ లోపాలను సరిదిద్దటానికి కమిషనరేట్ పరిధిలో డీపీఆర్ (డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్) విధానాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాల్లో పని చేసే అన్ని స్థాయిల సిబ్బందికీ ఇంట్రానెట్‌లో ప్రత్యేకంగా యూజర్ నేమ్, పాస్‌వర్డ్స్ కేటాయించారు.
 
ప్రతి రోజూ ఆయా సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లే సమయంలో పోలీసుస్టేషన్లు, ఇతర కార్యాలయాల్లోని కంప్యూటర్ల ద్వారా ఇంట్రానెట్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ రోజు వీరు ఏ ఏ విధులు నిర్వర్తించారనే సమాచారం కచ్చితంగా పొందుపరచాలి. వీటిని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు మానవవనరుల వినియోగాన్ని బేరీజు వేస్తుంది. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన సమీక్ష, ప్రక్షాళల్ని ఉన్నతాధికారులు చేపడతారు. ఈ డీపీఆర్ ఎవరికి వారు వ్యక్తిగతంలో ఫీడ్ చేయాల్సి ఉండగా... ఠాణాల రైటర్ల సాయంతోనే అందరూ చేయిస్తున్నట్లు కమిషనరేట్ దృష్టికి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఈ విధానాన్ని విడనాడాలని పునరుద్ఘాటించారు.
 
మరిన్ని వార్తలు