మోహన్‌బాబుకు అంతిమ వీడ్కోలు

11 Jun, 2016 23:41 IST|Sakshi
మోహన్‌బాబుకు అంతిమ వీడ్కోలు

 అధికార లాంచనాలతో జావాన్
  మృతదేహానికి అంత్యక్రియలు
  కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
 
 ఆమదాలవలస: తురకపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మొయ్యి మోహన్‌బాబు(33) అంత్యక్రియలు నిర్వహించారు. అధికార లాంచనాలతో అంత్యక్రియలు జరిపారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మొయ్యి మోహన్‌బాబు మృతి చెందిన విషయం విదితమే.
 
  శుక్రవారం రాత్రి తురకపేటకు చేరుకున్న జవాన్ మృతదేహానికి శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, పోలీసు బలగాలు, నేవీ బలగాలు, కుటుంబ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు అంతిమ వీడ్కోలు పలికారు. తన కుటుంబ సభ్యులు గ్రామంలో తమ సొంత పొలంలో దహనసంస్కారాలు చేశారు. తొలుత స్థానిక తహసీల్దారు కె.శ్రీరాములు, సీఐ డి.నవీన్‌కుమార్ మృతదేహానికి పూలమాలవేశారు.
 
 అనంతరం ఇండియన్ నేవీ లెఫ్ట్‌నెంట్ ముప్తి మహమ్మద్ సయ్యద్, జిల్లా సైనిక సంక్షేమ సంస్థ అధికారి జి.సత్యానందం, ఎన్‌సీసీ మధర్ యూనిట్ అధికారి  ఆర్.ప్రభుకుమార్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత మృతుని భార్య మీనాక్షి చేతుల మీదుగా మృతదేహంపై జాతీయ జెండాను కప్పించారు. ఎచ్చెర్ల ఆర్మీ రిజర్వ్‌డ్ పోలీసులు, తూర్పు నేవీ దళం సిబ్బంది గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అంత్యక్రియలు పూర్తిచేశారు.
 
 మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు
 మోహన్‌బాబు ఆకస్మిక మరణంతో తురకపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుని భార్య మీనాక్షి, నాలుగేళ్ల కుమారుడు జశ్వంత్, మూడేళ్ల కుమార్తె కోమలితో పాటు తల్లి నాగమ్మ, తండ్రి చిన్నారావు, అన్నదమ్ములు మృతదేహం వద్ద రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ కార్యక్రమంలో ఆర్మీ సుబేధర్ భగత్ సింగ్, హవాల్దార్ కె.ఎల్.రెడ్డి, ఎక్స్ ఆర్మీ హవాల్దార్ ఇప్పిలి సిమ్మన్నతో పాటు అధిక సంఖ్యలో మృతుని స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు