'ప్రాజెక్టు పూర్తికి 5వేల ఏళ్లు పడుతుంది'

14 Jun, 2016 19:57 IST|Sakshi
'ప్రాజెక్టు పూర్తికి 5వేల ఏళ్లు పడుతుంది'

ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి కష్టాలు తీరాలంటే 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ అన్నారు. దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణ అనుమతులు కూడా ఇచ్చారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఏడేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రాజెక్టు పురోగతిలో ఎలాంటి ముందడుగు పడలేదని అన్నారు. 2014, 2015, 2016ల్లో ప్రాజెక్టుకు ఏడాదికి మూడు కోట్ల చొప్పున ఇచ్చిన నిధులను నిర్మాణానికి ఉపయోగించలేదని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడానికి రూ.7,214 కోట్ల అంచనా వ్యయం కాగా.. సంవత్సరానికి మూడు కోట్లు విడుదల చేస్తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఐదు వేల ఏళ్లు పడుతుందన్నారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీరుకు నోచుకుని 15 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. 16 చిన్న, మధ్య తరహా నదుల ఉన్న ఈ ప్రాంతంలో ఏటా 207 టీఎంసీ నీరు లభ్యమవుతుండగా.. కేవలం 100 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుంటున్నామని ప్రాజెక్టు పూర్తయితే మిగతా 107 టీఎంసీలను వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి వెంటనే టెండర్లు పిలిచి సంవత్సరానికి కనీసం రూ.5,000 కోట్లయినా ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలోని అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు