‘కో’ అన్నాడు.. గోల్డ్‌మెడల్‌ కొట్టాడు..

30 Jan, 2017 23:00 IST|Sakshi
‘కో’ అన్నాడు.. గోల్డ్‌మెడల్‌ కొట్టాడు..
  • అంతర్జాతీయ ఖోఖోలో విరవ యువకుడి ప్రతిభ
  • విరవ (పిఠాపురం రూరల్‌) : 
    విరవ గ్రామానికి చెందిన యువకుడు యాళ్ల సతీష్‌కుమార్‌ అంతర్జాతీయ ఖోఖోలో సత్తా చాటి, గోల్డ్‌మెడల్‌ సాధించాడు. ఈ నెల 28న న్యూ ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో మన దేశం తరఫున ఇంగ్లండ్‌ జట్టుపై ఆడిన సతీష్‌ మంచి ప్రతిభ కనబరిచాడు. తద్వారా వచ్చే నెలలో జరిగే ఇంగ్లండ్‌ టూర్‌కు ఎంపికయ్యాడు. సతీష్‌కుమార్‌ విరవ జెడ్పీ పాఠశాలలో చదువుకున్నాడు. తండ్రి సత్తిబాబు వ్యవసాయ కూలీ. తల్లి సత్యవతి గృహిణి. అతడి ఇద్దరు సోదరులు కూడా వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం సతీష్‌ పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి ఖోఖో పట్ల మక్కువ కనబర్చడంతో కోచ్‌ రాంబాబు అతడికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. ఎనిమిదో తరగతి చదువుతూండగా జిల్లా జట్టుకు ఎంపికైన సతీష్‌ ఇప్పటివరకూ 16 సార్లు రాష్ట్రం తరఫున వివిధ ప్రాంతాల్లో జరిగిన ఖోఖో పోటీల్లో పాల్గొన్నాడు. మూడుసార్లు గోల్డ్, మూడు రజత పతకాలు సాధించాడు. తాను దేశం తరపున ఆడేందుకు సహకారం అందించిన కోచ్‌ రాంబాబుకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇంగ్లండుపై గెలిచి, బంగారుపతకం సాధించి తిరిగి వచ్చిన సతీష్‌కుమార్‌కు కోచ్‌ రాంబాబు ఆధ్వర్యాన గ్రామస్తులు సోమవారం రాత్రి ఘన స్వాగతం పలికారు.
     
మరిన్ని వార్తలు