'ప్రభుత్వాలవి దళిత వ్యతిరేక విధానాలు'

26 Apr, 2016 20:23 IST|Sakshi

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు ఆరోపించారు. బౌద్ధ వాఙ్మయం పరిఢవిల్లిన అమరావతి పట్టణాన్ని బ్రాహ్మణీకరణ చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని, ఈ విధానం సెక్యులర్ పద్ధతులకు విఘాతం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా తాత్సారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

 దళితులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయన్న కుట్రతోనే ఈ పోస్టులు భర్తీ చేయడంలేదన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే దళితుల భూములను కైవసం చేసుకోవడానికి జీవో-155ను తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో అన్ని మండలాలు కరువులో ఉన్నాయని, ఎండాకాలంలో మధ్యాహ్న భోజనాన్ని అన్ని మండలాలకు విస్తరింపచేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో దళితవాడల్లో పాఠశాలలను తొలగించడం రాజ్యాంగా స్ఫూర్తిగా విరుద్ధమన్నారు. అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించామని చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ అంబేడ్కర్ ఆశయ సాధనకు తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు.

 

మరిన్ని వార్తలు