భర్త,మామ వేధింపులతో ఆ మహిళను..

18 Jul, 2016 00:22 IST|Sakshi
భర్త ఇంటి ముందు నిరసన తెలుపుతున్న రంగవల్లి

► ఇంటి నుంచి గెంటేశారు

► న్యాయం కోసం భర్త ఇంటి ముందు ఆందోళన

తుర్కయంజాల్‌: న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. హయత్‌నగర్‌ మండలం రాగన్నగూడలోని నీలం సంజీవరెడ్డినగర్‌కాలనీలో ఆదివారం ఈ ఘటన జరిగింది.  బాధితురాలి కథనం ప్రకారం... కృష్ణాజిల్లా గుడివాడ మండలం మోటూరుకు చెందిన రంగవల్లి (33)కి పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆచంట శ్రీనివాస్‌తో 2007లో పెళ్లైంది.  వీరికి పాప (8), బాబు (6) ఉన్నారు.  శ్రీనివాస్‌ ఎలక్ర్టీషియన్‌గా పని చేస్తూ హయత్‌నగర్‌ మండలంలోని నీలం సంజీవరెడ్డినగర్‌కాలనీ ఉంటున్నాడు. పెళ్లైనప్పటి నుంచి శ్రీనివాస్, అతడి తండ్రి వెంకటేశ్వర్లులు అనుమానంతో రంగవల్లిని వేధిస్తూ చిత్రహింసలకు గురి చేసేవారు.

వీటిని తాళలేక రెండేళ్ల క్రితం రంగవల్లి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి పలుమార్లు ఇరు కుటుంబాల పెద్దలు చర్చించినా శ్రీనివాస్‌లో మార్పు రాలేదు. ఏడాది క్రితం సెలవుల పేరుతో రంగవల్లి వద్ద ఉన్న పాప, బాబును శ్రీనివాస్‌ తీసుకొచ్చి తన వద్దే ఉంచుకుంటున్నాడు. పిల్లలను, భర్తను విడిచి ఉండలేక రంగవల్లి పలుమార్లు శ్రీనివాస్‌ను ప్రాథేయపడినా కనికరించలేదు. దీంతో ఆదివారం తండ్రి శ్రీహరితో కలిసి రంగవల్లి భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలని, పిల్లలను తనకు అప్పగించడంతో పాటు భర్త కావాలని నిరసన చేపట్టింది. ఈ విషయం ముందే కనిపెట్టిన శ్రీనివాస్, వెంకటేశ్వర్లు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రంగవల్లి భీష్మించి కూర్చుంది.


 

మరిన్ని వార్తలు