జల్సాలకు మరిగి..

17 Sep, 2016 09:19 IST|Sakshi
జల్సాలకు మరిగి..

కడప అర్బన్‌:
ఇద్దరు చైన్‌స్నాచర్స్‌ను, వారికి సహకరించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.60 లక్షల విలువైన 175 గ్రాముల బరువున్న 8 బంగారు చైన్‌లు, ఒక మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కడప డీఎస్పీ ఈజీ అశోక్‌ కుమార్‌ శుక్రవారం తమ కార్యాయలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన తెలిపిన మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడపలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరు నిందితులను కడప అర్బన్‌ సీఐ యు.సదాశివయ్య, తాలూకా ఎస్‌ఐ ఎన్‌.రాజరాజేశ్వరరెడ్డి తమ సిబ్బందితో కలిసి మరియాపురం చర్చి సర్కిల్‌లో ఈ నెల 15న వాహనాల తనిఖీల సమయంలో అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో కడప బ్రాహ్మణ వీధిలోని డివి రావు వీధిలో నివసిస్తున్న సత్య సుబ్రమణ్యం కుమారుడు కుప్పంరెడ్డి శేఖర్‌ (19) ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

మరో నిందితుడు రెండవ గాంధీ బొమ్మ దగ్గర మఠం వీధిలో నివసిస్తున్న ఖాదర్‌ బాషా కుమారుడు గగ్గుటూరు వాహిద్‌ (19) కడప నగర శివార్లలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరు కడపలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిల్లో 8 చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నప్పటి నుంచి స్నేహితులుగా తిరుగుతూ మద్యం సేవించడం, జూదం లాంటి చెడు వ్యసనాలకు బానిసయ్యారు. రెడ్డిశేఖర్‌ తన మోటార్‌ సైకిల్‌ (ఏపి04 బిఎ 3641)పై కడపలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. వారు మైదుకూరు వైపు నుంచి వస్తూ పోలీసులను గమనించి మోటార్‌ సైకిల్‌పై పరారవుతుండగా అరెస్ట్‌ చేశారు. 8 బంగారు చైన్‌లను చోరీ చేశామని వారు ఒప్పుకోవడంతో రికవరీ చేశారు. వాహిద్‌ తల్లి చాందిని తన కుమారుడు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ఉంటే వారించడం బోయి, ప్రోత్సహించింది. వారు దొంగలించిన బంగారు చైన్‌లను ఆమె ద్వారానే విక్రయించడం, వచ్చిన డబ్బులను పంచుకోవడం జరుగుతుండేదని విచారణలో తేలింది. దీంతో ఆమెను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ కేసును ఛేదించడానికి కృషి చేసిన అర్బన్‌ సీఐ సదాశివయ్య, తాలూకా ఎస్‌ఐ రాజ రాజేశ్వర్‌ రెడ్డితోపాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు