ఓటర్లతో ఒట్టు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఆవాలు

12 Feb, 2016 02:53 IST|Sakshi
ఓటర్లతో ఒట్టు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఆవాలు

♦ ‘ఖేడ్’లో విచిత్ర పోకడ
♦ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న మంత్రగాళ్లు
♦ మూఢనమ్మకాల ఉచ్చులో జనం

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ కల్హేర్: ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆఖరి అస్త్రంగా మద్యం, డబ్బుతో ఆకట్టుకుంటారని అందరూ అనుకంటే.. విచిత్రంగా ఆవాలు, వేపాకు, మంత్రాలపై ఆశలు పెట్టుకోవడం గమనార్హం. నిజానికి ఖేడ్‌లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల నుంచి ఒట్టు పెట్టించి ఓట్లు రాబట్టారు. నియోజకవర్గంలో 168 గ్రామాలు ఉండగా దాదాపు 70 శాతం గ్రామాలు నిరక్షరాస్యత అధికంగా ఉన్న గ్రామాలే. మూఢ నమ్మకాలు ఎక్కువే. గ్రామీణ జనం గ్రామ దేవతను, క్షుద్ర శక్తులను బలంగా నమ్ముతారు. ఈ బలహీనతలను ఆసరా చేసుకున్న రాజకీయ నాయకులు.. కులాలు, తెగల వారీగా ఓటర్లను సమీకరించి చేతితో వేపాకు, పసుపు పట్టించి వారి వారి కుల దేవతల మీద ప్రమాణం చేయిస్తున్నారు.

హన్మండ్ల కట్ట మీద ఒట్లు పెట్టిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచే ఈ తంతు ప్రారంభమైంది. కంగ్టి, మనూరు, కల్హేర్,నారాయణఖేడ్ మండలాల్లో ఈ రకమైన క్షుద్ర ఒత్తిడి ఎక్కువగా ఉంది. తాజాగా శనివారం నాటి పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలో అడుగు పెట్టిన వెంటనే ఓటర్లను కట్టడి చేసేందుకు ఓ పార్టీ నాయకులు మంత్రశక్తులు ప్రయోగించారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కల్హేర్ మండలంలోని రాపర్తి, మీర్ఖాన్‌పేట, అలీఖాన్‌పల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల చుట్టూ దుండగులు ఆవాలు చల్లారు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఏ పార్టీకి ఓటు వేద్దామనుకున్నా వారికి కావాల్సిన గుర్తు మీదే ఓటు వేస్తారనేది వారి నమ్మకం.

ఓటును తమకు అనుగుణంగా వేయకుంటే క్షుద్రశక్తులు దాడి చేస్తాయనే ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఓడిపోతామనే నిర్ణయానికి వచ్చిన ఓ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపు కోసం మంత్రాలు చేసిన ఆవాలు బూత్‌ల వద్ద పారబోశారనే విషయం ఆయా గ్రామాల్లో చర్చనీయంశమైంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఓటర్లు తమకు అనుకులంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రచారానికి ఆయా గ్రామాల్లోని ప్రజలు భయపడి పోతున్నారు. పోలింగ్ నాటికి ఈ వదంతులు మరెంతగా వ్యాపిస్తాయోనని జనం చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు