సమస్యల పరిష్కారానికి చర్యలు

13 Mar, 2017 23:01 IST|Sakshi
సమస్యల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
ప్రజావాణిలో 170 అర్జీలు
కాకినాడ సిటీ : ప్రజల నుంచి వినతుల ద్వారా వచ్చే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 170 మంది హాజరై వినతులను అందజేశారు. కలెక్టర్‌ అరుణ్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తి అర్జీలను తీసుకున్నారు. మండల, డివిజన్‌ స్థాయిలోని అర్జీల పరిష్కారానికి తహసీల్దార్లు, ఎంపీడీఓలకు, సంబంధిత శాఖలకు సంబంధించి జిల్లా అధికారులకు సూచిస్తూ పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. ప్రజవాణిలో వ్యక్తిగత సమస్యలు, పింఛన్లు, ఉపాధి, సంక్షేమ పథకాల రుణాలు, ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాల వినతులను కలెక్టర్‌ స్వీకరించగా, భూమి రికార్డులు, సర్వే, ఇళ్లు, రేషన్‌కార్డులు తదితర అంశాల అర్జీలను జేసీ స్వీకరించారు. పలు అర్జీలపై మండలస్థాయి అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి నిర్ధిష్ట కాలవ్యవధిలో పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
అన్యాక్రాంతమైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి
కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీలో అన్యాక్రాంతమైన సామాజిక స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ పంచాయతీ పాలక వర్గ సభ్యులు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉచిత విద్య అందించేందుకు స్కూల్‌ నిర్మిస్తామని దరఖాస్తు చేసుకున్న శ్రీ అరవింద్‌ సొసైటీకి నిబంధనలకు విరుద్ధంగా 2000 సంవత్సరంలో అప్పటి సర్పంచ్‌ రెండెకరాల సామాజిక స్థలం కేటాయించారన్నారు. కాని నేటికీ స్కూలు నిర్మించలేదని, ఆ స్థలం అన్యాకాంతమైందని ఆరోపించారు. దీనిపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకొవాలని ఉప సర్పంచ్‌ బీవీవీ సత్యనారాయణ, వార్డు సభ్యులు కోరారు
మరిన్ని వార్తలు