సమస్యల పరిష్కారానికి సమయమివ్వండి

20 Dec, 2016 02:25 IST|Sakshi
సమస్యల పరిష్కారానికి సమయమివ్వండి
ఏలూరు (మెట్రో) : సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత సమయం వేచి చూడాలని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వారి సమస్య పరిష్కారం కాలేదంటూ తర్వాతవారమే మీ కోసం కార్యక్రమానికి వచ్చి వినతులు అందిస్తున్నారన్నారని, ప్రజలిచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ చేస్తారని, కొన్ని సందర్భాల్లో ఇరుపక్షాల వారితో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని, ఈ సమయంలో ఆ సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని కలెక్టర్‌ చెప్పారు. ప్రజలు డబ్బు, సమయం వృథా చేసుకోకుండా కొన్నిరోజులు వేచి చూడాలన్నారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే తన దగ్గరకు వస్తే ఆ సమస్య ఏ పరిస్థితుల్లో ఉందో తాను తెలుసుకుని వాటి పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ చెప్పారు. ప్రజలిచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి సాధ్యమైనంత తొందరలో పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్‌ చెప్పారు. 
lభీమడోలు మండలం గుండుగొలను 2వ వార్డులో పంచాయతీకి చెందిన రోడ్డును ఆక్రమించుకుని కొందరు షాపులు, ఇళ్లు నిర్మాణాలు చేపట్టారని రెడ్డి దుర్గారావు, మరికొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 
lగోపాలపురం మండలం కొవ్వూరుపాడులోని ఎస్సీ పేటకు ఆనుకుని ఇళ్ల మధ్యలో కోళ్లఫారం ఏర్పాటు చేశారని, దానివల్ల దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఈగలు, దోమలు, విషపురుగుల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కె.చిట్టిబాబు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.
lచింతలపూడి మండలం ఊట సముద్రం గ్రామ ఉప సర్పంచి పాములపాటి నర్సారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ గ్రామ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదు చేశారు. 
lపోలవరం మండలం గూటాలకు చెందిన ముంగర రమణరావు, మల్లిపూడి వెంకటలక్ష్మి తాము కులాంతర వివాహం చేసుకున్నామని, కులాంతర వివాహ ప్రోత్సాహకం నిధులు తమకు అందలేదని ఫిర్యాదు చేశారు. 
lదెందులూరు మండలం కొవ్వలికి చెందిన యర్రా రాము, చాట్ల ధర్మయ్య, చప్పిడి ముసలయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ పంచాయతీకి చెందిన ఎకరా 25 సెంట్లు భూమి ఇళ్లస్థలాలుగా అందించాలని కోరారు. 
lఆకివీడు మండలం సిద్ధాపురానికి చెందిన సర్పంచి తోట శివాజీ కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తూ సిద్ధాపురం పంచాయతీ పరిధిలోని వందమిల్లిపాడులో ఉన్న 38 సెంట్ల భూమిని కొందరు ఆక్రమించుకున్నారని దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ సమస్యలపై స్పందించిన కలెక్టర్‌ సమస్యలపై విచారణ చేసి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారాల్లో అధికారులు తాత్సారం చేస్తే అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్‌ కలెక్టర్‌ షరీఫ్, డీఆర్‌వో కట్టా హైమావతి, హౌ సింగ్‌ పీడీ ఇ.శ్రీనివాసరావు, ఎల్‌డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు