ఇక్కడ మీరే ఉండేవారు.. | Sakshi
Sakshi News home page

ఇక్కడ మీరే ఉండేవారు..

Published Tue, Dec 20 2016 2:24 AM

Jagadish Reddy fires on Congress

మండలిలో కాంగ్రెస్‌పై జగదీశ్‌రెడ్డి విసుర్లు

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలిలో సోమవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. టీఎస్‌ ఐ పాస్, సులభతర వ్యాపార విధానంపై చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ మాట్లాడుతూ తెలంగాణ వస్తే అంధకారం ఏర్పడుతుందని, విచ్ఛిన్నకర శక్తులు తలెత్తు తాయని, పరిశ్రమలు తరలిపోతాయని భయాందోళనలు వ్యక్తం చేశారని పరోక్షంగా కాంగ్రెస్‌ సభ్యులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మండలి విపక్షనేత  షబ్బీర్‌ అలీ అభ్యంతరం తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయిందని, గతంలో ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారని.. సమస్యలపై బైఠాయించారని, టీఆర్‌ఎస్‌లోకి మారగానే అన్నీ మారిపోయాయా అని షబ్బీర్‌ ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క మెగావాట్‌ కూడా అదనంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేదన్నారు. దీనిపై  మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. అదనంగా ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయకపోయినా మిగులును సాధించి రైతాంగానికి 7 నుంచి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పారిశ్రామికవేత్తల ధర్నా లు, పవర్‌ హాలిడేల స్థాయి నుంచి ఇప్పుడు ప్రజలు పొగిడే స్థాయికి చేరుకున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితి బాగుందన్నారు. ‘‘అదే మీరు చేసి ఉంటే ఇక్కడ (అధికారపక్షంలో) మీరే ఉండేవారు. ఆ పని మీరెందుకు చేయలేకపోయారు’’అంటూ జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.

Advertisement
Advertisement